డైలాగ్ చెప్పి 24 గంటలు కాకముందే మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ పెద్ద షాకే ఇచ్చింది. పీసీసీ డెలిగేట్ గా కొవ్వూరు నుండి ఏఐసీసీ చిరంజీవిని పీసీసీ డెలిగేట్ గా నామినేట్ చేసింది. అక్టోబర్, 2027 వరకు నామినేట్ చేయటమే కాకుండా ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పింది. పీసీసీ డెలిగేట్ గా ఐడీ కార్డు ఇచ్చిందంటేనే అర్ధం పార్టీ అధ్యక్ష పదవికి జరగుతుందని అనుకుంటున్న ఎన్నికలో ఓటు వేయాలని చెప్పటమే.
ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక నేపధ్యంలో దేశవ్యాప్తంగా పీసీసీ డెలిగేట్లందరికీ ఏఐసీసీ ఐడీ కార్డులను జారీచేస్తోంది. ఇందులో భాగంగానే చిరంజీవికి కూడా గుర్తింపు కార్డు జారీ అయ్యింది. పార్టీ వర్గాల ప్రకారం టెక్నికల్ గా చిరంజీవి కాంగ్రెస్ నేతనే అనుకోవాలి. ఎందుకంటే రాజ్యసభ సభ్యత్వ కాలపరిమితి అయిపోయిన తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో మళ్ళీ బిజీ అయిపోయిన కారణంగానే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు.
పార్టీలో ఎక్కడా కనబడటం లేదు కానీ పార్టీకి చిరంజీవి ఇంతవరకు రాజీనామా చేయలేదు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు కాబట్టే చిరంజీవి ఆటోమేటిగ్గా పీసీసీ డెలిగేట్ అయిపోతారు. పార్టీకి రాజీనామా చేసేస్తే అప్పుడు సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. రాజీనామా చేయనంతవరకు చిరంజీవి పీసీసీ డెలిగేట్ గానే కంటిన్యూ అవుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవటం ఇష్టం లేని చిరంజీవి దూరంగా ఉన్నంత మాత్రాన సరిపోదు.
పార్టీకి దూరంగా ఉంటున్న చిరంజీవి వేరే పార్టీలో కూడా చేరలేదు. అందుకనే పీసీసీ డెలిగేట్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగును చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం మధ్యాహ్నం పోస్టు చేశారు. ‘నేను రాజకీయాల నుండి దూరంగా ఉన్నాను…కానీ, రాజకీయాలు నానుండి దూరంకాలేదు’ అనే డైలాగును జనాల్లోకి వదిలారు. దాంతో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారా అనే చర్చ పెరిగిపోయింది. దానికి తగ్గట్లే బుధవారం డెలిగేట్ గా ఐడీ కార్డు రైజ్ చేసి కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి పెద్ద షాకే ఇచ్చింది.