ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ ను యధేచ్చగా కొనసాగిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమ మైనింగ్ ను ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమను అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే పేరు మైనింగ్ వ్యవహారంలో తెరపైకి వచ్చింది.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ మహిళా నేతగా పేరున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ గ్రానైట్ తవ్వకాల కోసం భూములివ్వాలని ఎస్సీలను బలవంతం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్సీ కమిషన్కు ఫిర్యాదులు అందాయి. తాజాగా రజనీపై ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిసి ఎడవల్లి సొసైటీ రైతులు ఫిర్యాదు చేశారు. గ్రానైట్ కోసం తమ భూములను ప్రభుత్వం తీసుకుంటోందని వారు ఆరోపించారు. భూములివ్వని వారిపై వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
మైనింగ్ కోసం భూములివ్వని మురికిపూడి ఆదిబాబుపై అధికార పార్టీ నేతలు దాడి చేశారని ఎస్సీ కమిషన్కు రైతులు తెలిపారు. ఎమ్మెల్యే రజనీ అండతోనే అధికార పార్టీ నేతలు తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటలో దళితుల శ్మశానం కూడా కబ్జా చేశారని ఓ రైతు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటలో దళితులకు ఇచ్చిన స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేశారని మరో రైతు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రజనీ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు తమకే ఉండేలా చూడాలని ఎస్సీ కమిషన్ను రైతులు కోరారు.