మేమేమీ నవ్వులాటగా చెప్పట్లేదు. నిజంగానే నిజం. తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సాధారణంగా ప్రజావాణిలో ఎవరైనా సరే తమ వ్యక్తిగత సమస్యలు.. తమ ఊళ్లో నెలకొన్న సమస్యల గురించి ఫిర్యాదు లు చేస్తుంటారు. వాటిని వివిధ శాఖలకు చెందిన వారు పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా జగిత్యాల పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ప్రజావాణికి వచ్చి.. అక్కడి అధికారులకు ఒక ఫిర్యాదు అందజేశారు.
ఏదో సమస్య మీద వినతిపత్రం ఇచ్చారనుకున్న సదరు అధికారి.. అందులోని మేటర్ చదివి షాక్ తిన్నాడు. జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మటం లేదని కంప్లైంట్ ఇచ్చారు. బీరం రాజేష్ అనే వ్యక్తి జగిత్యాలలోనిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బీఎస్. లతకు ఈ వినతిపత్రాన్ని అందజేశారు. తమ ఊళ్లోని వైన్స్.. బార్లలో కేఎఫ్ అనే కంపెనీకి చెందిన బీర్లను అమ్మటం లేదని పేర్కొన్నారు.
నాణ్యత లేని బీర్లను అమ్ముతున్నారని.. వీటి ద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం ఉందన్నారు. అంతేకాదు.. కింగ్ ఫిషర్ బీర్లు అమ్మకపోవటం వల్ల.. ఆ బీర్ల కోసం 20-30కిలోమీటర్లు ప్రయాణించి మరీ కొనుక్కోవాల్సి వస్తోందని.. ఇదోసమస్యగా మారిందని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కింగ్ ఫిషర్ బీర్లు బెల్టుషాపుల్లో అమ్ముతున్నారని.. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన వారు మాత్రమే మద్యం అమ్మాలని ప్రభుత్వం చెబుతోందని.. కానీ బెల్డు దుకాణాల్లో అమ్ముతున్నారని.. వారిపై చర్యలు ఎందుకుతీసుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రజావాణిలో వచ్చిన ఈ ఫిర్యాదు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో హడావుడి చేస్తోంది. మరి.. సదరు ఫిర్యాదు మీద అదనపు కలెక్టర్ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.