టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు, మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణులపై నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, విష్ణుల దగ్గర హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసిన నాగ శ్రీనుపై చోరీ ఆరోపణలు చేయడం, కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ఇక, కులంపేరుతో తనను మోహన్ బాబు, విష్ణులు దూషించారంటూ నాగ శ్రీను ఆరోపించడం తెలిసిందే.
ఈ క్రమంలోనే నాయీ బ్రాహ్మణులకు, బీసీలకు మోహన్ బాబు క్షమాపణలు, మోహన్ బాబు క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత కూడా ఈ వ్యవహారంపై మోహన్ బాబు, విష్ణులు స్పందిచలేదు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం మరింత ముదిరింది. తాజాగా మోహన్ బాబు, మంచు విష్ణులపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు దాఖలైంది.
నాగశ్రీనును కులం పేరుతో దూషించారంటూ నాయీబ్రాహ్మణ సంఘం నేతలు హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. నాయీ బ్రాహ్మణ కులాన్ని కించపరిచినందుకు మోహన్ బాబు, విష్ణులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. నాగశ్రీను గత 11 ఏళ్లుగా మోహన్ బాబు ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడని, అతడిని కులం పేరుతో దూషించడం దారుణమని నాయీబ్రాహ్మణ సంఘం నేత శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కేసును పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు.
నాగశ్రీనుకు క్షమాపణలు చెప్పేందుకు రెండ్రోజుల సమయం ఇచ్చినా స్పందించలేదని, అందుకే హెచ్చార్సీని ఆశ్రయించామని శ్రీనివాస్ చెప్పారు. 75 ఏళ్ల తర్వాత కూడా మన దేశంలో కుల దూషణ పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ఇటీవల నాగ శ్రీను కుటుంబానికి మెగా బ్రదర్ నాగబాబు ఆర్థిక సాయం అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి, ఈ వ్యవహారంపై ఇప్పుడైనా మోహన్ బాబు, విష్ణు స్పందిస్తారా? హెచ్చార్సీ ఏరకమైన చర్యలు తీసుకోబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.