అత్యున్నత పదవుల్ని చేపట్టిన వారి నోటి నుంచి వచ్చే మాటలు ఆచితూచి అన్నట్లుగా ఉండాలి. తప్పులు దొర్లకూడదు. అలాంటి వారు నోరు జారితే.. దాని ప్రభావం సమాజం మీద ఉండటమే కాదు.. కొత్త తరహా తలనొప్పులు తెర మీదకు వస్తాయి.
ఇప్పటికే ప్రజల మధ్య రకరకాల వికారాలతో చీలికలు పీలికలు అవుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారు.. పదవి పోయినంత మాత్రాన నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం మంచిది కాదు.
మనకు కాస్త దూరాన ఉండే అఫ్గానిస్తాన్ లో డ్రగ్స్ కు బానిసలైన వారిని వేధించి.. వేధించి మరీ శిక్షిస్తున్నారు తాలిబన్లు. సమాజానికి వినాశకారులుగా మారుతున్నారంటూ డ్రగ్స్ కు బానిసలైన వారిని జైల్లోని ఇరుకు గదుల్లో వేసి.. భోజనం కూడా పెట్టకుండా మాడ్చేస్తూ.. బతికి ఉండగానే నరకం ఏమిటో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు తాలిబన్లు. అలాంటప్పుడు డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులకు సంబంధించి ఏమైనా మాట్లాడినప్పుడు.. వారి మతాన్ని ప్రస్తావించి వ్యాఖ్యలు చేయటం సబబేనా అన్నది ప్రశ్న.
ఎందుకంటే.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయానికి వస్తే.. అతడ్ని అరెస్టు చేసిన తర్వాత పలువురు పలు రకాలుగా స్పందించటం తెలిసిందే. కొందరు చిన్నపిల్లాడని బాలీవుడ్ సెలబ్రిటీలు ముద్దు చేస్తే.. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాత్రం.. అతగాడి ‘మతాన్ని’ బయటకు లాగటం గమనార్హం.
ఆమె మాటలు విన్న తర్వాత.. ముస్లింలు డ్రగ్స్ తీసుకోవచ్చా? అలా తీసుకున్న వారిని అరెస్టు చేయకూడదా? విచారణ చేసే క్రమంలో అరెస్టు చేస్తే.. అప్పుడు మతం చప్పున గుర్తుకు వస్తుందా? లాంటి సందేహాలు రాక మానవు.
షారుక్ కొడుకును ప్రభుత్వం వేధిస్తుందంటూ నోరు పారేసుకుంటున్న ముఫ్తీ.. అందుకు దన్నుగా మతాన్ని బయటకు లాగిన వైనాన్ని చూస్తే.. పలు సందేహాలు కలుగక మానవు.
షారుక్ ను భారతీయులు నటుడిగా చూశారే కానీ.. అతను ముస్లిం అని హిందువులు అతన్ని సూపర్ స్టార్ చేశారా? బాలీవుడ్ బాద్షాను చేశారా? రైతుల్ని కార్లతో తొక్కించి చంపిన వారిని వదిలేసి.. ఖాన్ పేరు ఉన్నకారణంగా 23 ఏళ్ల కుర్రాడ్ని వేధించటం సరికాదని ఆమె వ్యాఖ్యానించటం చూస్తే.. రెండు వేర్వేరు అంశాల్ని కలగలిపి.. దానికి మతం రంగు పూయటం ఏ మాత్రం సరికాదు.
యూపీ రైతుల విషయంలో కేంద్రమంత్రి కొడుకు చేసిన నిర్వాకాన్ని ఎవరూ వెనకేసుకురావటం లేదు. అదే సమయంలో.. ముఫ్తీ లాంటి వారు కూడా డ్రగ్స్ వ్యవహారానికి మతాన్ని లింకు వేయటం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.