టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల చెబుతున్నట్టు రాజకీయ కక్షలు.. ఒక్క ఏపీలోనేనా.. కాదు.. కాదు.. పొరుగునే ఉన్న చైనాలోనూ కనిపిస్తున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో చైనాలో తాజాగా జరిగిన ఓ ఘటన చర్చకు వస్తోంది. అక్కడ ప్రభుత్వం దెబ్బకు భారీ వ్యాపార వేత్త.. ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు.
ఆలీబాబా.. ఈ పేరు నిన్న మొన్నటి వరకు.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద స్టోరీ. ఏ ఇద్దరు కలిసినా.. ఆలీబాబా విజయాలపైనే మాటలు కలిపేవారు. విద్యార్థులకు ఆలీబాబా విజయం ఒక్క పాఠ్యాంశం. యువతకు ఆలీబాబా కష్టం.. ఒక స్ఫూర్తి.. వ్యాపారులకు..ఆలీబాబా.. ఒక బలమైన పోటీ దారుడు!! కానీ.. ఇప్పుడు అదే ఆలీబాబా జీవితంలో చీకట్లు ముసురుకున్న పరిస్థితి. ఎవరూ పట్టించుకోని.. ఎవరికీ పట్టని.. వ్యాపార వేత్తగా ఆలీబాబా మిగిలిపోయారు. అంతేకాదు.. భారీ నష్టాలు కొని తెచ్చుకుని తల్లడిల్లుతున్న పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆలీబాబా ప్రస్తుత పరిస్థితికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానం ఇదే!!
చైనాకు చెందిన బిలియనీర్, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ `ఆలీబాబా` వ్యవస్థాపకుడు జాక్ మా. ఒకప్పుడు ఈయన గురించి కథలుకథలుగా చెప్పుకొనేవారు. భూమికి నాలుగు అడుగులు కూడా ఉండని.. ఈయన గురించి పెద్ద ఎత్తున చర్చలు. కానీ, ఇప్పుడు అందరూ బేల చూపులు.. జాలి చూపులు. రీజన్.. కేవలం ఆయన చేసిన ఒక్క ప్రసంగం!! ఒకే ఒక్క ప్రసంగం.. జాక్ మా తలరాతను మార్చేసింది. ఆలీబాబా అద్భుత దీపాన్ని కొడిగట్టేలా చేసింది. జోరుగా సాగుతున్న ఆలీబాబా వ్యాపారాలు.. లక్షల కోట్లలో సాగుతున్నాయి. ప్రపంచం మొత్తం ఆయనవైపే చూసింది.
అయితే.. సరిగ్గా ఏడాది క్రితం అది కూడా కరోనా సమయలో.. జాక్ మా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆయన తలరాతను మార్చేశాయి. జాక్ మా చైనా పాలకుల ఆగ్రహానికి గురై భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. మరి ఆ ప్రసంగం ఖరీదు ఎంతో తెలుసా.. 344 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 25 లక్షల కోట్లకు పైమాటే!! ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. 2020 అక్టోబరు 24.. చైనాలో ‘ది బండ్ సమిట్’ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న జాక్ మా ఓ ప్రసంగం చేశారు. అందులో చైనా ఆర్థికవ్యవస్థలోని లోపాలను ఆయన ప్రస్తావించారు.
చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలంటూ సలహా కూడా ఇచ్చారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు అవసరమని సూచించారు. చైనాలో సచేతనమైన ఆర్థిక విధానాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి రోగికి తప్పుడు ఔషధాలు ఇచ్చినట్లే పనిచేస్తాయని ఎద్దేవా చేశారు. అంతే!! ఆ క్షణం నుంచి జాక్ మా ప్రస్థానం పతనం దిశగా అడుగులు వేసింది.
అసలే చైనాలో ఉన్నది జిన్‌పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ. అందులోనూ జాక్ మా చేసిన వ్యాఖ్యలు నేరుగా జిన్‌పింగ్‌ను తాకాయి. మరి ప్రభుత్వం ఊరికే ఎలా ఉంటుంది. ప్రతీకారం మొదలు పెట్టింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. జాక్ స్థాపించిన యాంట్ గ్రూప్‌ను ఐపీవోకు వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో స్టాక్ మార్కెట్లలో అలీబాబా షేర్లు కూడా పతనమవుతూ వచ్చాయి. ఇంకేముంది.. అలీబాబా గ్రూప్ సంపదతో పాటు జాక్ మా నికర సంపద కూడా హారతికర్పూరంలా కరగడం మొదలుపెట్టింది. దీంతో ఇప్పుడు.. పూర్తిగా ఆలీబాబా.. దీపం కొడిగట్టే పరిస్థితి వచ్చింది.