గత వారం విడుదలైన ‘కమిటీ కుర్రాళ్ళు’ హిట్ గా నిలచింది. ప్రస్తుతం టాలీవుడ్లో చిన్న సినిమాల పరిస్థితి దయనీయంగా మారింది. వాటికి సరైన రిలీజ్ డేట్ దొరకడమే కష్టం. పేరున్న సినిమాలతో పాటుగా రిలీజ్ చేస్తే కంటెంట్ ఉన్నా సరే జనాలు పట్టించుకోరు. థియేటర్ల సమస్య కూడా ఉంటుంది. దీంతో బాక్సాఫీస్ డల్లుగా ఉండి.. స్లంప్ నడుస్తున్న టైంలో రిలీజ్ చేసుకోవాలి. అలాంటపుడు జనం థియేటర్లకు రారు. సినిమా గురించి తెలిసేలోపే వీకెండ్ అయిపోతుంది. జనం దృష్టిలో సినిమా పడదు. వారం తిరిగేసరికి కొత్త సినిమాలు వచ్చేస్తాయి. ముందొచ్చిన సినిమా పాతబడిపోయి అడ్రస్ లేకుండా పోతుంది.
ఈ నేపథ్యంలో చిన్న సినిమాకు మంచి టాక్ వచ్చి.. ఆ టాక్ జనాలకు చేరి.. జనం థియేటర్లకు వచ్చి సినిమా చూసి దాన్ని హిట్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. ఇలా అరుదుగా మాత్రమే ఓ సినిమా ఆడుతుంటుంది. ఏడాదిలో రెండో మూడో చిత్రాలకు మాత్రమే ఇలాంటి అనుభవం ఉంటుంది.
ఇప్పుడు ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా ఇలాగే హిట్ అయింది. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ లేదు. అందరూ కొత్తవాళ్లతో కొత్త దర్శకుడు రూపొందించిన సినిమా కావడమే ఇందుక్కారణం.
మెగా అమ్మాయి నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేయడం తప్ప ఇందులో ఆకర్షించే అంశాలు పెద్దగా కనిపించలేదు. ఐతే సినిమా రిలీజ్ అయ్యాక కథ మారింది. ‘హ్యాపీడేస్’ తరహా నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చేలా పల్లెటూరి సెటప్‌లో దర్శకుడు యదు వంశీ,.. మంచి ఫీల్ ఉన్న సినిమా తీశాడు. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి. మంచి మ్యూజిక్, పెర్ఫామెన్స్లు కూడా తోడవడంతో ‘కమిటీ కుర్రాళ్ళు’ జనాన్ని థియేటర్లకు రప్పిస్తోంది. వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తర్వాత కూడా బలంగా నిలబడుతోంది. ఇలా ఓ చిన్న సినిమా మంచి హిట్ దిశగా దూసుకెళ్తుండడం ఆ టీంకే కాక ఇండస్ట్రీ వర్గాలకు కూడా సంతోషాన్నిస్తోంది.