రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో సర్వాధికారాలు సీఎంకు ఉంటాయి. ప్రజల సమస్యలపైనా.. సంక్షేమ పథకాలపైనా తదితర అంశాలపై నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ అధికారాలతో ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి కీలక విషయాల్లో సీఎంకు సూచనలు ఇవ్వడం చేస్తుంటారు. ఇక సలహాదారులైతే ఏమైనా విషయాల్లో ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
కానీ ఏపీలో మాత్రం సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేల కంటే కూడా సలహాదారు పదవిలో ఉన్న వ్యక్తే కీలకంగా మారారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. హా.. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆయన.. ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో జగన్ నీడలా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అన్నీ శాఖాల్లోనూ..
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా జగన్ నియమించారు. ఈ ప్రభుత్వానికి సలహాదారులు దాదాపు అరవై మందికి పైగా ఉన్నా ఒక్క సజ్జల మాత్రమే ఆ పదవికి మించి న్యాయం చేస్తున్నారని టాక్. మిగిలిన సలహాదారులు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. కానీ సజ్జల మాత్రం పార్టీ, ప్రభుత్వ విషయాల్లో సర్వం తానై వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖ ఈ శాఖ అనే తేడా లేకుండా అన్ని శాఖల విషయాలపైనా ఆయనే విలేకర్లతో మాట్లాడుతున్నారనే విమర్శలున్నాయి. ఇక ఎవరైనా జగన్‌ను ప్రభుత్వాన్ని విమర్శిస్తే వెంటనే సజ్జల రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చేస్తారనే టాక్.
ఎక్కడ చూసినా..
ప్రస్తుతం ఏపీలో ఏ విషయంలోనైనా సజ్జలనే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల నేతలపై సజ్జల చెబితేనే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయన షాడో హోం మంత్రిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక జగన్‌కు ప్రజా ప్రతినిధులకు మధ్య వారధిగా సజ్జల మారరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగ సంఘాల చర్చలకు అసలు సజ్జలకు ఏ మాత్రం సంబంధం లేదు.
ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య సానుకూల వాతావరణం నెలకొల్పేందుకు మాజీ ఉద్యోగ సంఘాల నేత చంద్రశేఖర్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. కానీ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. అంతా సజ్జలనే చూసుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో బొత్స, పేర్ని నాని, బుగ్గన ఉన్నా అందులో సజ్జలదే కీలక పాత్ర అని చెప్పడంలో తప్పేమీ లేదు. కరోనా పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని ఇప్పుడు వెనక్కి తగ్గదని ఆయన తాజాగా విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో ఆయనపై ఉద్యోగ సంఘాల నేతలు విరుచుకుపడుతున్నారు.