ప్రపంచ క్రికెట్లో అత్యంత ఆసక్తి రేకెత్తించే మ్యాచ్ అంటే భారత్-పాకిస్థాన్లదే. ఈ రెండు జట్ల మ్యాచ్ ఎక్కడ జరిగినా సరే.. ఇరు దేశాలకు చెందిన సెలబ్రెటీలు పెద్ద ఎత్తున వెళ్లిపోతున్నారు.
దుబాయ్లో జరిగిన నిన్నటి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్కు కూడా భారత్ నుంచి ఎంతోమంది సెలబ్రెటీలు హాజరయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ సుకుమార్, మంత్రి నారా లోకేష్ తదితరులు స్టేడియానికి వెళ్లి ఈ మ్యాచ్ వీక్షించారు. ఐతే ఈ మ్యాచ్కు తెలుగులో కామెంట్రీ చెప్పిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. ఈ సెలబ్రెటీల గురించి చేసిన వ్యాఖ్య వివాదాస్పదం అయింది.
తెర మీద సుకుమార్ కనిపించిన సమయంలో ఒక వ్యాఖ్యాత ఆయన్నుద్దేశించి ‘ప్రైడ్ ఆఫ్ తెలుగు’ అన్నాడు. అంతే కాక మ్యాచ్ చూడడానికి చాలామంది తెలుగు వాళ్లు వచ్చారని, ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎవ్వరూ మిస్ అవ్వొద్దని అనుకుంటారని, ఈ మ్యాచ్ టికెట్లకు డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ అని వ్యాఖ్యానించాడు. దీనికి అంబటి రాయుడు బదులిస్తూ.. ‘‘అట్లని కూడా కాదు. ఇట్లాంటి మ్యాచ్ అంటే టీవీలో ఎక్కువ కనిపిస్తారు కదా. వేరే మ్యాచ్ల్లో కనిపించడం తక్కువ ఉంటుంది. పవర్ ఆఫ్ క్రికెట్ అది. పబ్లిసిటీ స్టంట్’’ అని కామెంట్ చేశాడు.
సంబంధిత క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ సహా సెలబ్రెటీల గురించి రాయుడు అంత మాట అనేశాడు ఏంటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సుకుమార్ మామూలుగా లోె ప్రొఫైల్ మెయింటైన్ చేసే వ్యక్తి. అలాంటి వాడు టీవీలో కనిపించడం కోసం ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు వెళ్లాడని అనడం ఎంత విడ్డూరం. ఒక్క సుకుమార్నే కాక ఈ మ్యాచ్కు వెళ్లిన సెలబ్రెటీలందరినీ కలిపి ఇలాంటి కామెంట్ చేయడం టూమచ్. ఈ విషయంలో చాలామంది రాయుడిని విమర్శిస్తున్నారు.