వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వ్యవహారం పార్లమెంటులోనూ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇక, మాధవ్ డర్టీ పిక్చర్ పై లోక్ సభ స్పీకర్, ప్రధాని మోదీలకు కూడా ఫిర్యాదులు అందాయంటే ఆ గోరింటాకు వీడియో ఎంత రచ్చ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా సరే మా మాధవ్ నాలుగు గోడల మధ్య ఏదో చేసుకుంటే మీకెందుకు అన్న రీతిలో వైసీపీ నేతలు మాట్లాడుతున్న వైనం మాధవ్ వీడియో కన్నా జుగుప్సాకరంగా ఉందన్న టాక్ వస్తోంది.
మామూలుగా అయితే, ప్రతి చిన్న విషయానికి ప్రతిపక్ష నేతలపై నోరేసుకుని పడిపోయే రోజా, వాసిరెడ్డి పద్మ వంటి వైసీపీ మహిళా నేతలు..మాధవ్ వీడియోపై మాత్రం నామ మాత్రపు కామెంట్లు చేసి పక్కకు తప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గోరంట్ల మాధవ్ గోరింటాకు వీడియోపై వైసీపీ మాజీ నేత, ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ తనదైన రీతిలో స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, మాధవ్ పై పృథ్వీ విమర్శలు గుప్పించారు.
గోరంట్లకు అంగబలం, అర్థబలం ఉందని, అందుకే గోరంట్లను వైసీపీ నేతలు వెనకేసుకువస్తున్నారని ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ ఆరోపించారు. అంతేకాదు, ఆ వీడియోపై గోరంట్ల మాధవ్ స్పందించిన తీరు కూడా వైసీపీ నేతలకు నచ్చినట్టుందని పృథ్వీ సెటైర్లు వేశారు. ఇంతటి దౌర్భాగ్యం ఇంతకు ముందెన్నడూ చూడలేదని పృథ్వీ విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో తెలుగు ఎంపీలకు ఓ మంచి చరిత్ర ఉందని, దానిని గోరంట్ల తుడిచిపెట్టేశారని మండిపడ్డారు.
గోరంట్ల వ్యవహారంలో వారం పాటు మీడియా సమావేశాలు పెట్టిన నేతలు ఇప్పుడు ఏమయ్యారని పృథ్వీ ప్రశ్నించారు. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెబుతున్న విషయాలు ఒకదానితో మరొకటి పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపించారు. చివరకు ఆ వీడియో ఫేక్ అని తేల్చారని, ఎవరెన్ని చెప్పినా ప్రజలు ఆ మాత్రం అవగాహన చేసుకోకుండా ఉండలేరా? అని వైసీపీ నేతలను పృథ్వీ ప్రశ్నించారు.