30 ఈయర్స్ ఇండస్ట్రీ…అంటూ తన మార్క్ డైలాగులతో, టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించే కమెడియన్ గా టాలీవుడ్ లో పృథ్వీ రాజ్ కు మంచి పేరుంది. టాలీవుడ్ లోని పలు చిత్రాల్లో తనదైశన శైలిలో నటించి మెప్పించిన పృథ్వీ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, సినీ రంగంలో రాణించినట్లుగా రాజకీయ రంగంలో పృథ్వీ సక్సెస్ కాలేకపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పృథ్వీ విస్తృత ప్రచారం చేశారు.
అందుకు ప్రతిఫలంగా పృథ్వి ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించడం…ఆ తర్వాత ఓ మహిళతో పృథ్వీ మాట్లాడినట్టు ఆడియో టేప్ ఆరోపణలు రావడం కలకలం రేపాయి. దీంతో, ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించారు. ఆ పదవి పోయిన తర్వాత పృథ్వీ ఇటు రాజకీయాల్లోనూ అటు సినీ రంగంలోనూ చురుగ్గా పనిచేయడం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ ఘటన తర్వాత పృథ్వీని సొంత పార్టీ దూరం పెట్టిందని, ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రావడం లేదని టాక్ ఉంది.
ఆ తర్వాత వైసీపీ నేతలపై, జగన్ పై విమర్శలు గుప్పించిన పృథ్వీ…వైసీపీని వీడి వేరే పార్టీలో చేరబోతున్నారని చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఊహాగానాలకు తగ్గట్లుగానే తాజాగా తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్లు పృథ్వీ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు జనసేన కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబును కలిసిన అనంతరం పృథ్వీ ఈ ప్రకటన చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష ముగియగానే ఆయన సమక్షంలో పృథ్వీ పార్టీలో చేరబోతున్నారు. ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో పృథ్వీ జనసేన కండువా కప్పుకోబోతున్నారట. రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచి పృథ్వీ పోటీ చేసే అవకాశం ఉందట.
Comments 1