ప్రముఖ కమెడియన్, నటుడు అలీ ఎక్కడ? ఇదేం ప్రశ్న.. ఆయన హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు కదా అనుకోవచ్చు. అవును.. సినిమాలు చేసుకుంటున్న ఆయన ఏపీ ఎన్నికల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీకి మద్దతునిస్తూ ఆ పార్టీలో చేరి, గౌరవ సలహాదారుగా నియమితులైన అలీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మాత్రం మిస్సయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు జగన్ కోసం తన ఆప్తమిత్రుడైన పవన్ కల్యాణ్‌నే దూషించిన అలీ ఇప్పుడు పత్తా లేకుండా పోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ, జనసేన నుంచి సీటు ఆశించి ఫలితం లేకపోడంతో అలీ గతంలో వైసీపీలో చేరారు. కొన్ని రోజుల పాటు జగన్‌కు మద్దతుగా పవన్‌పై విమర్శలు చేశారు. కానీ అందుకు ప్రతిఫలం మాత్రం దక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. గౌరవ సలహాదారు పోస్టుతో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఈ సారి అయినా ఎన్నికల బరిలో దిగుతామనుకుంటే నిరాశే ఎదురైంది. అందుకే జగన్‌పై అలీ సీరియస్‌గా ఉన్నారని తెలిసింది. దీంతో ఈ ఎన్నికలతో తనకు సంబంధమే లేదన్నట్లు అలీ వ్యవహరిస్తున్నారని టాక్. ప్రచారంలో ఎక్కడా ఆయన కనిపించడం లేదు.
ఎలాగో ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని అలీకి కూడా తెలిసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన గౌరవ సలహాదారు పోస్టును పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పోస్టు ఉన్నా, ఊడినా అలీకి పెద్ద తేడా ఉండదు. అధికారం నిలబెట్టుకోలేని జగన్‌కు ప్రచారం చేసినా వృథానే అనే ఆలోచనలో అలీ ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రచారంతో సంబంధం లేనట్టుగా వ్యహరిస్తూ తన పనేదో తాను చేసుకుంటున్నారనే చెప్పాలి. ఈ ఎన్నికలయ్యాక వైసీపీతో బంధాన్ని కూడా అలీ తెంచుకుంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.