చిత్తూరు జిల్లా వైసీపీలో కొంతకాలంగా లుకలుకలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. మంత్రి రోజా వర్సెస్ పెద్దిరెడ్డి అన్నరీతిలో కోల్డ్ వార్ చాలాకాలంగా నడుస్తోంది. ఆ వ్యవహారాన్ని జగన్ చక్కదిద్దక ముందే తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీలో అంతర్గత కలహాలు రోడ్డున పడ్డాయి. మంత్రి ఉషశ్రీ చరణ్ కు తాజాగా నిరసన సెగ తగిలింది. సొంత పార్టీలోనే ఆమె వ్యతిరేక వర్గీయులు తాజాగా సమావేశం ఏర్పాటు చేయడం అనంతపురం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి ఇంట్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు….ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో కళ్యాణదుర్గంలో మండల స్థాయి నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పాల్గొని తమ ఆవేదనను తిప్పేస్వామి ముందు వెళ్లగక్కారు. పార్టీలో తమను అవమానిస్తున్నారని, ఏ కార్యక్రమానికీ ఆహ్వానించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉషశ్రీ చరణ్ టిడిపి నుంచి వచ్చారని, అందుకే వైసీపీ కేడర్ ను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.
అయితే, ఈ భేటీ జరుగుతున్న సమయంలోనే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో ఉషశ్రీ చరణ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కళ్యాణదుర్గ జీవనాడి అయిన బీటీపీ ప్రాజెక్టు కాలువ పనులపై చర్చించేందుకే ఉషశ్రీ వచ్చారని తెలుస్తోంది. అయితే, పార్టీలో అంతర్గత కలహాల నేపథ్యంలోనే ఉషశ్రీ చరణ్ కు జగన్ క్లాస్ పికినట్టుగా తెలుస్తోంది. అందరినీ కలుపుకొని పోవాలని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ వర్గ పోరు పార్టీకి నష్టం కలిగిస్తుందని జగన్ హితవు పలికినట్లుగా తెలుస్తోంది.