వారిద్దరూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. ఆ ఇద్దరిలో ఒకరు మంత్రి కూడా. వీరిద్దరి మధ్య కొంతకాలంగా పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలంలో ఉన్న మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో పోస్టింగ్ నేపథ్యంలో వారి మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకాకాని మల్లన్న సన్నిధిలో ఆ పోస్టింగ్ లో తమ వర్గీయులనే అపాయింట్ చేయాలని అధికార పార్టీ నేతలు సిగపట్లు పడుతున్న వైనం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
దేవాదయ శాఖా మంత్రి వెల్లంపల్లి పేషీలో పనిచేస్తున్న ఒకరికి, ఆయన ఇంటి వద్ద పనిచేసే మరో ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి జీతాలు వెళ్లేవని తెలుస్తోంది. అయితే, అలా జీతాలు వెళ్లడాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. దీంతో, ఆ దేవస్థానం ఈవో పానకాలరావును అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆ తర్వాత పానకాలరావు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే, ఆ తర్వాత పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆ నలుగురికి జీతాలు చెల్లించాలని మంత్రి వెల్లంపల్లి పేషీ నుంచి ఈవోకు ఆర్డర్ వచ్చింది. కానీ, స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్య అలా ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో, ఆ ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డిపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేయగా…తాను ఏమీ చేయలేనని, ఎమ్మెల్యే ఆదేశాలు పాటించానని చెప్పారట. దీంతో,వెల్లంపల్లి, ఎమ్మెల్యే రోశయ్యల మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తన వర్గీయుడైన పానకాలరావును పెద్దకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా వెల్లంపల్లి నియమించారు. కానీ, అందుకు రోశయ్య అడ్డుపడ్డారు. దీంతో, గతంలో ప్రకాశం జిల్లా సింగరకొండ ఆంజనేయస్వామి దేవస్థాన ఈవోగా శ్రీనివాసరెడ్డి పనిచేసిన కాలంలో అవకతవకలు జరిగాయంటూ విచారణ చేపట్టారు. ఆ కారణంతో శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసి…పానకాలరావుకు లైన్ క్లియర్ చేశారని తెలుస్తోంది.
పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో పోస్టింగ్‌పై చాలాకాలంగా వైసీపీలో కోల్డ్ వార్ జరుగుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆ ఆలయ ఈవో సుబ్బారావు పదవీ విరమణ చేయడంతో ఎమ్మెల్యే ఆర్కే తన సమీప బంధువైన శ్యామలా రఘునాథరెడ్డిని ఇన్చార్జి ఈవోగా నియమించారు. ఆ టైంలో రోశయ్య తన వర్గీయుడైన శ్రీనివాసరెడ్డిని ఈవోగా నియమించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 6 నెలల తర్వాత రఘునాథరెడ్డిని తాడేపల్లి గ్రూపు దేవాలయాలకు బదిలీ అయ్యారు.
ఆ తర్వాత శ్రీనివాసరెడ్డిని పెదకాకాని ఈవోగా నియమించుకున్నారు రోశయ్య. అయితే, ఆ నలుగురి జీతాల వ్యవహారంలో రోశయ్య అడ్డుపడడంతో తాజాగా జనవరి 20న శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మరి, ఎవరు మీలో కోటీశ్వరుడు హాట్ సీట్ లా మారిన ఆ ఈవో పోస్టింగ్ ను ఏ నేత దక్కించుకుంటారన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.