2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్న సంగతి తెలిసిందే. నెల్లూరు వైసీపీలో ముసలం మొదలవడంతో కోటంరెడ్డి, ఆనం, మేకపాటిలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కొందరు వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న వైనం అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు వైసీపీలో లుకలుకలు రోడ్డునపడ్డాయి. గుంటూరు వైసీపీలో ఎమ్మెల్యే మద్దాలి గిరి, ఎమ్మెల్యే ముస్తఫాల మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది.
గుంటూరు ఈస్ట్ లో ఉన్న కన్యకాపరమేశ్వరి ఆలయం కొత్త కమిటీని ముస్తఫా ఐదుగురు సభ్యులతో వేశారు. తొమ్మిది మందితో వేయాల్సిన కమిటీని కేవలం ఐదుగురికే పరిమితం చేయడం, మద్దాలి గిరి, నగర మేయర్ కావటి మనోహర్ సూచించిన పేర్లేమీ కమిటీలో లేకపోవడం వివాదానికి దారి తీసింది.
ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన గిరి సూచించిన పేర్లు లేకపోవడంపై ఆర్యవైశ్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇతర వర్గాలను, అన్యమతస్తులను కమిటీలోకి తెచ్చేందుకు ముస్తఫా ప్రయత్నిస్తున్నారని ఆర్యవైశ్యులు ఆరోపించారు. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే అధికారుల తీరుపై ముస్తఫా మండిపడ్డారు. తాను చెప్పినా అధికారులు పనులు చేయడం లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా బహిరంగ విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ముస్తఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికార పార్టీలో లేనా? తాను చెప్పినా అధికారులు పనులు చేయరా అంటూ ముస్తఫా సమావేశంలోనే అసహనం వ్యక్తం చేశారు. లక్ష రూపాయలతో కల్వర్టు నిర్మాణం చేయలాని ఎమ్మెల్యే స్థాయిలో తాను చెప్పినా స్పందన లేదని ఆయన మండిపడ్డారు. తాను రికమెండ్ చేసినా పనులు చేయరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల పాటు వేచి చూశానని, ఇక వెయిట్ చేయలేనని ముస్తఫా అన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ ను కౌన్సిల్ కు పిలిపించాలని, అప్పటి వరకు కౌన్సిల్ సమావేశాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలోనే ఎన్టీఆర్ సర్కిల్ ను అభివృద్ధి చేయాలని టీడీపీ కార్పొరేటర్లు పట్టుబట్టడంతో అధికార పార్టీ కార్పొరేటర్లు ఇరకాటంలో పడ్డారు. గుంటూరులో ఎన్టీఆర్ సర్కిల్ ను మాత్రమే డెవలప్ చేయకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. అయితే, తన నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ సర్కిల్ ను తానే అభివృద్ధి చేస్తానని ముస్తఫా చెప్పారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు హాల్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.