తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేల డీల్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేసి వారిని కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారన్న ఆరోపణలు కలకలం రేపాయి. అయితే, తమను కొనేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు, ఏసీబీ అధికారులకు పట్టించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే పోలీసులు, ఏసీబీ అధికారులు….రోహిత్ రెడ్డితో కలిసి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వివరాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముందస్తుగానే ఆ డీల్ జరగబోతున్న ఫామ్ హౌస్ లోపల, బయట పోలీసులు మఫ్టీలో పహారా కాశారని తెలుస్తోంది. ఇక, ఈ డీల్ సందర్భంగా ఫామ్ హౌస్ లో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కోసం నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు వాడినట్లుగా తమ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కోర్టుకు వెల్లడించారు.
హాల్లో రహస్య కెమెరాలు అమర్చామని, రోహిత్ రెడ్డి కుర్తా జేబులోను రెండు వాయిస్ రికార్డులు పెట్టామని వారు కోర్టుకు వివరించారు. మధ్యాహ్నం 3.05 నిమిషాలకు ఆ రహస్య కెమెరాలను ఆన్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. అంతేకాదు, రామచంద్ర భారతి, నందుల మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ స్క్రీన్ షాట్లను కూడా కోర్టుకు వారు సమర్పించారు. ఇక, రహస్యంగా నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్ లో ‘‘కొబ్బరి నీళ్లు తీసుకురండి’’ అనే కోడ్ వర్డ్ ఆ ముగ్గురి కొంప ముంచిందని తెలుస్తోంది.
పక్కాగా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు, పోలీసులు రోహిత్ రెడ్డికి ఈ కోడ్ వర్డ్ ముందుగానే చెప్పినట్టు తెలుస్తోంది. వారితో డీల్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ రోహిత్ రెడ్డి ఈ కోడ్ చెప్పిన వెంటనే ఏసీబీ అధికారులు, పోలీసులు ఒక్కసారిగా ఫామ్ హౌస్ లోపలికి వచ్చి ఆ ముగ్గురుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ డీల్ జరుగుతున్నంతసేపు ఫామ్ హౌస్ లోపల, వెలుపల పోలీసులు మారు వేషాలలో ఉన్నట్టుగా తెలుస్తోంది.