రాసలీలల సీడీలు కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. కర్ణాటక మాజీమంత్రి పేరుతో సంచలనమైన రాసలీలల సీడీలు ఎంతగా కలకలం సృష్టించాయో అందరికీ తెలిసిందే. సదరు సీడీలోని దృశ్యాలన్నీ నకిలీవని, వాటిని ఓ హోటల్లో సృష్టించారని సదరు మాజీమంత్రి ఎంత మొత్తుకుంటున్నా ఎవరు పట్టించుకోవటంలేదు.
ఇపుడు తాజా పరిస్దితి ఏమిటంటే బీజేపీలోని ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎంఎల్ఏలపై ఇలాంటి రాసలీలల సీడులున్నాయనే విషయమై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాసలీలల సీడులు కూడా ఉన్నాయంటూ స్వయంగా బీజేపీ ఎంఎల్ఏనే ప్రకటించటం సంచలనంగా మారింది.
విజయపుర ఎంఎల్ఏ బసవనగౌడ యత్నాళ్ మాట్లాడుతు ప్రస్తుత, మాజీ మంత్రులతో పాటు యడ్డీ రాసలీలల సీడీలున్నాయని పెద్ద బాంబే పేల్చారు. విధానసౌధలో మాట్లాడుతూ యడ్డీ రాసలీలల సీడీలు కొందరు పార్టీ ఎంఎల్ఏల దగ్గర కాపీలున్నాయన్నారు. మొత్తం 23 మందికి సంబంధించిన రాసలీలల సీడీలు కొందరు మంత్రులు, ఎంఎల్ఏల దగ్గరుందని యత్నాళ్ చేసిన ప్రకటన అధికారపార్టీలో ప్రకపంపలు పుట్టిస్తోంది.
మొత్తానికి యత్నాళ్ వేసిన తాజా బాంబు కారణంగా చివరకు యడ్డీ ప్రభుత్వం మరోసారి అర్ధాంతరంగా పడిపోయే ప్రమాదం ఉందంటున్నారు. యడ్డీనీ సీఎంగా తప్పించాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికి యడ్యూరప్ప నాలుగుసార్లు సీఎంగా బాధ్యతలు తీసుకున్నా ఒక్కసారి మాత్రమే ఐదేళ్ళున్నారు. మిగిలిన మూడుసార్లు ఆరోపణలు రావటం, అర్ధాంతరంగా కుర్చీలో నుండి దిగిపోవటమే. మరి ఇపుడేమి జరుగుతుందో చూడాలి.