కర్ణాటకలో కుమార స్వామి సర్కార్ ను కుప్పకూల్చి బీజేపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలో కొనసాగుతోన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ….యడియూరప్పను ముఖ్యమంత్రిని చేసింది. కేంద్రంలోని పెద్దల అండదండలతో ముందుకు సాగిన యడ్డీ… సంకీర్ణ కూటమికి వెన్నుపోటు పొడిచిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఇచ్చిన మాట ప్రకారం తనకు మద్దతిచ్చిన వారికి మంత్రి పదవులు, కీలక పదవులు కట్టబెట్టారు.
అయితే, వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు, కీలక పదవులు కట్టబెట్టడంతో ఏళ్ల తరబడి బీజేపీనే నమ్ముకొన్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. యడియూరప్ప స్థానంలో మరొకరిని సీఎం చేయాలని…పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని కర్ణాటక బీజేపీలోని పలువురు సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, పార్టీలోని అంతర్గత ముసలాన్ని యడ్యూరప్ప పెద్దగా పట్టించుకోలేదు. దీంతో, గత ఏడాది చిక్ మంగుళూరులోని ఓ రిసార్టులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు యడ్డీకి వ్యతిరేకంగా సమావేశం కావడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపింది. వీరంతా యడియూరప్పను గద్దె దించేందుకే రహస్యంగా భేటీ అయ్యారన్న ప్రచారం జరిగింది.
యడ్డీకి వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేత బసన్నగౌడ పాటిల్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. యడ్డీ వ్యతిరేక ఎమ్మల్యేలను బసన్నగౌడ కూడగట్టి….తిరుగుబాటు బావుటా ఎగువవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. యడ్డీ స్థానంలో సీఎం కావాలన్న యోచనతోనే బసన్నగౌడ రెబల్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో ఈ వ్యవహారం సద్దమణిగింది. అయితే, తాజాగా మరోసారి యడ్డీని గద్దె దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం మొదలైంది.
యడియూరప్పపై అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు సీఎంను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారట. దీంతో, ఈ విషయంపై అధిష్ఠానం అభిప్రాయ సేకరణకు నడుంబిగించిందట.పలువురు బీజేపీ సీనియర్ నేతల నివేదిక అనంతరం ముఖ్యమంత్రి మార్పుపై అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట.యడ్డీకి వ్యతిరేకంగా కొందరు సంతకాల సేకరణ చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీ చీఫ్ విప్ సునీల్ కుమార్ కూడా సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలంటూ ట్వీట్ చేయడంతో ఆ ఊహాగానాలకు ఊతం వస్తోంది. అదీగాక, అధిష్టానం ఆదేశిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని స్వయంగా యడియూరప్ప ప్రకటించడం కలకలం రేపుతోంది. మరోవైపు, యడియూరప్పకు మద్దతుగా 65 మంది ఎమ్మెల్యేలు బీజేపీ హైకమాండ్ కు లేఖ రాయడం కూడా చర్చనీయాంశమైంది.