ఔను.. ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తోంది నెటిజన్ల నుంచి. మా పాలన బాగుంది.. మా పాలన బంగారంగా ఉంది.. మా పాలనలో సంక్షేమం పోటెత్తుతోంది.. అని ఊకదంపుడు ఉపన్యాసాలు దంచే రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు.. తమ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నవారు ఎలా ఉన్నా.. ఫర్వాలేదు.. అనుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఏం చేసినా.. చెల్లుతుందనే ధోరణిలో ఉన్నారు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఒకరిద్దరు మంత్రులు.. ఇద్దరు ముగ్గురుఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు వచ్చినా.. కేసీఆర్ సర్కారు చీమకుట్టినట్టుకూడా వ్యవహరించలేదు. ఏపీలోనూ ఇలానే ఉంది. ఒకరిద్దరు మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు.. కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. కనీసం..వాటిలో నిజం ఎంత అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం జగన్ సర్కారు చేయడం లేదనే విమర్శలు వున్నాయి.
కానీ.. ఈ రెండు ప్రభుత్వాలకు కళ్లు తెరిపించే ఘటన పొరుగునే ఉన్న తమిళనాడులో వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల సీఎం స్టాలిన్ తేని ఎమ్మెల్యేని స్వయంగా పిలిచి.. క్లాస్ పీకారు. దీనికి కారణం.. ఆయనపై ఆరోపణలు రావడమే. అంతేకాదు.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా చెప్పారు. ఇక, తాజాగా ఒక మంత్రిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు. క్యాష్ ఫర్ జాబ్స్, మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుండి తొలగించారు.
వాస్తవానికి ఈ విషయంలో గవర్నర్ ఎన్. రవి ఒప్పుకోలేదు. కానీ.. సీఎం స్టాలిన్ పట్టుబట్టి.. మరీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మంత్రి వర్గం నుంచి తొలగించే వరకు పట్టుబట్టి సాధించారు. తన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణనలను సహించేది లేదని తేల్చి చెప్పారు. మరి తెలుగు రాస్ట్రాల్లో ఇలా ఉంటే.. పొరుగున ఉన్నకొత్త ముఖ్యమంత్రి.. మాత్రం తన వారైనా.. పరాయివారైనా రాజధర్మం పాటిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.