రాజకీయ ప్రత్యర్థుల మీద కోపం ఉండొచ్చు, కసి ఉండొచ్చు. కానీ వాళ్లను అదే పనిగా టార్గెట్ చేస్తే జనాల్లో సానుభూతి వస్తుంది. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతిపక్షంలో ఉన్న వారిని వేధింపులకు గురి చేస్తే అవతలి వారికి అది మేలు చేస్తుందని చెప్పడానికి చరిత్రలో ఎన్నో రుజువులు ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తెలియంది కాకపోయినా.. ఆయన తన కక్షసాధింపు ధోరణిని విడిచిపెట్టలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఇదే తీరులో వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తోంది.
జనసేనాని పవన్ కళ్యాణ్‌ను నాలుగేళ్లుగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నారు. పవన్ సినిమాల టికెట్ల రేట్లు తగ్గించి వేధించడంతో మొదలుపెడితే ఎన్నో విషయాల్లో జగన్ ప్రభుత్వ తీరు వివాాదాస్పదం అయింది. పవన్ ఓ పర్యటన చేయాలన్నాా కూడా అనేక ఆంక్షలు విధించడం విస్మయం కలిగించింది. ఇది జనసేన, పవన్ కళ్యాణ్ పట్ల జనాల్లో సానుభూతి రావడానికి కారణమైంది. జగన్ పనిగట్టుకుని పవన్‌ను హీరోను చేశారనే అభిప్రాయం ఉంది.
ఇక్కడ ఈ అనుభవం ఇలా కనిపిస్తుండగానే..
త్వరలో తమిళ టాప్ స్టార్ విజయ్ రాజకీయ రంగప్రవేశం చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విజయ్ సైలెంటుగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఐతే విజయ్‌ని తన మానాన తనను వదిలేస్తే.. కమల్ హాసన్ లాగా పెద్దగా ప్రభావం చూపించకపోయినా ఆశ్చర్యం లేదేమో. కానీ విజయ్ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందే అతణ్ని టార్గెట్ చేస్తోంది స్టాలిన్ సర్కారు. ‘లియో’ సినిమాకు మార్నింగ్ షోలు త్వరగా మొదలు కాకుండా ఆంక్షలు విధించడం.. ఆ సినిమా ఆడియో వేడుకకు అడ్డంకులు సృష్టించడం లాంటి చర్యలతో విజయ్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికేలా చేస్తున్నారు.
అలాగే సామాన్య జనంలోనూ విజయ్ పట్ల సానుభూతి తెస్తున్నారు. విజయ్ కూడా మరింత మొండిగా, కసిగా రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమయ్యేలా చేస్తున్నారు. ఇది స్టాలిన్ సర్కారుకు ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.