తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించని రీతిలో ఇటు పార్టీలో తనదైన శైలిలో పట్టు బిగించడమే కాకుండా కీలకంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే ఇప్పుడు మరింత వ్యూహాత్మకంగా తన రాజకీయ ప్రత్యర్థుల బలాలను దెబ్బతీయడంపై సైతం ఫోకస్ పెంచారని చర్చ జరుగుతుంది. తాజాగా సెక్రటేరియట్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి తో రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
మేఘా సంస్థ తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ సంస్థగా ఎదిగిన తీరు పలువురు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అయితే, అదే సమయంలో ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఉన్నప్పుడు మేఘాకు పెద్దపీట వేశారని బహిరంగంగానే వివిధ రాజకీయ పార్టీలు విమర్శించాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ దుమ్మెత్తి పోసింది. అయితే గత ఎన్నికల్లో అధికారం మారడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం తో ఇలాంటి సంస్థల విషయంలో ఏం జరగనుందని ఆసక్తి నెలకొంది. అయితే దీనికి సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ముందుకొచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో యూనివర్సిటీ క్యాంపస్ లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. నేడు సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
హైదరాబాద్ శివార్లలో కందుకూరు మండలంలో మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ లోనే యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ ముందుకు వచ్చింది.
అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్ నిర్మిస్తామని మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
అయితే, ఈ ఎపిసోడ్ పై రాజకీయ వర్గాల్లో కీలక చర్చ జరుగుతోంది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన కేసీఆర్ నమ్మిన బంటుగా ఉన్న కంపెనీతో తన కలల ప్రాజెక్టుకి సహకారం అందిపుచ్చుకునే విధంగా రేవంత్ రెడ్డి పావులు కలిపి సక్సెస్ అయ్యారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పరిణామం కచ్చితంగా గులాబీ దళపతి కేసీఆర్ ఊహించనిదని అంచనా వేస్తున్నారు. దీనిపై గులాబీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో మరి.