సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ ఘటనకు పరోక్షంగా కారణమైన హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపింది. అయితే,
పుష్ప-2 సక్సెస్ మీట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మరిచిపోయినందుకే అల్లు అర్జున్‌పై సీఎం కక్ష కట్టారని బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ విమర్శించారు.
ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. ఎవరో తన పేరు మరిచిపోతే తాను ఫీల్ కానని, తన స్థాయి అది కాదని రేవంత్ అన్నారు. అలాంటి అసత్య వార్తలు ఎవరూ నమ్మవద్దని చెప్పారు. అంతేకాదు, ఇటువంటి ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్‌పై ఉందని రేవంత్ గుర్తు చేశారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, తనతో కలిసి వారు తిరిగారని, అల్లు అర్జున్ పై తనకు కోపం ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
అయితే, సంధ్య థియేటర్ ఘటన తీవ్రత వల్ల కఠినంగా వ్యవహరించక తప్పదని, చట్టం వేరు వ్యక్తిగత పరిచయం వేరని చెప్పారు. సినిమా వాళ్లు డ్రగ్స్ వద్దని ప్రజల్లో అవగాహన పెంచడం, పలు సామాజిక అంశాలపై ప్రచారం చేయాలని కోరారు. ‘మా’ అసోసియేషన్‌కు స్థలాలిస్తామని, ప్రభుత్వంతో ఇండస్ట్రీ కలిసి పని చేయాలని రేవంత్ చెప్పారు. పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తిని తాను అని అన్నారు.