తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వందలాది మంది అమరవీరుల త్యాగాల, వేలాదిమంది ప్రజల పోరాటాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి ప్రత్యేక తెలంగాణ కల సాకారం చేసిందని గుర్తు చేసుకున్నారు. పదేళ్లుగా ఉన్న బిఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాన్య ప్రజల, అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని చెప్పారు. ఓ పక్క తాను ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెలను బద్దలు కొట్టామని అన్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రజా భవన్ కు రావచ్చని రేవంత్ అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ దగ్గర మిగిలిన కంచెలను బద్దలు కొడతామని, ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రేవంత్ చెప్పారు.
ఆ ప్రజాదర్బార్ కు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకారం అందించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక, కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల ఫైలుపై రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజనీకి గతంలో మాట ఇచ్చినట్టుగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ మరో ఫైల్ పై రేవంత్ సంతకం చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరి వెళ్లారు.