సోలార్ విద్యుత్ ఒప్పందాల రచ్చలో జగన్ కు అదానీ లంచం ఇచ్చారని ఆరోపణలు రావడం సంచలనం రేపింది. ఈ క్రమంలో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’’కి అదానీ ఇస్తానన్న 100 కోట్ల విరాళం వద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత అదానీ విషయంలోతనపై కామెంట్లు చేసిన కేటీఆర్ కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. బుద్ధిమంతుడు కేటీఆర్ అదానీ సంకలో దూరాడని, కేటీఆర్ కాదు సైకో రాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ తలా తోకా లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని, కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నాడని, జైలుకు వెళ్తే సీఎం అవ్వొచ్చని కలలు కంటున్నాడని సెటైర్లు వేశారు. ఆ లెక్కన జైలుకు వెళ్లిన కవితకే సీఎం అయ్యే చాన్స్ ఉందని చురకలంటించారు. తాను కేటీఆర్, కేసీఆర్ మాదిరి కవితకు బెయిల్ ఇప్పించేందుకు ఢిల్లీ వెళ్లలేదని, నిధుల కోసం వెళ్లానని రేవంత్ అన్నారు. గతంలో అదానీకి కేసీఆర్, కేటీఆర్ వంగి వంగి సలాం కొట్టారని, తాను ఎప్పుడూ అలా వంగి దండాలు పెట్టలేదని చెప్పారు.
అదానీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని రోడ్డు కాంట్రాక్టులు ఇచ్చిందో విచారణ చేసేందుకు కేటీఆర్ రెడీనా అని ఛాలెంజ్ చేశారు. బీఆర్ ఎస్ కు అధికారం, డిపాజిట్లు, మెదడు పోయిందని రేవంత్ విమర్శించారు. అసెంబ్లీలో విచారణ చేయమని తమను రెచ్చగొట్టింది కేటీఆర్ అని, కాబట్టే నీటి పారుదల, విద్యుత్ వంటి అంశాలపై విచారణ చేశామని అన్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టమని బీఆర్ఎస్ నేతలు అడిగారు కాబట్టే వాళ్లు అడిగింది చేశామని చురకలంటించారు.