సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. ముఖ్యమంత్రిగా స్పీడ్ చూపిస్తున్నారు. పదవి చేపట్టినప్పటి నుంచి గ్యారెంటీల హామీలు, సమీక్షలంటూ బిజీగా గడుపుతున్న ఆయన.. ప్రధాన విపక్షం బీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. అసెంబ్లీలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అబద్దాలే చెప్పిందంటూ కుండబద్ధలు కొట్టారు. బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నా తగ్గేదేలే అంటూ రేవంత్ దూసుకెళ్తున్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏం లేదంటూ రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ కు రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మేనేజ్ మెంట్ కోటాలో వచ్చిన నాయకులకు ఏం తెలియదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన కోసం టీఎస్ న్యాబ్ ను ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వమే అని కేటీఆర్ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ కేవలం కాగితం మీదే న్యాబ్ ను ఏర్పాటు చేశారని అప్పుడు కమిషనర్ గా ఉన్న సీవీ ఆనంద్ కు అదనపు బాధ్యతలు అప్పగించిందని రేవంత్ విమర్శించారు. సిబ్బందిని అడిగినా, రూ.29 కోట్ల నిధులు అడిగినా ఇవ్వలేదని రేవంత్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఆవేశంతో సాగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించారు. ప్రచార బాధ్యతలను భుజాలకెత్తుకుని రాష్ట్రాన్ని చుట్టేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ ఆలోచనతో వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులు ప్రజలకు తెలియాలని శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రగతి భవన్ కంచెలు తొలగించి ప్రజలను అనుమతి కల్పించారు. రెండు గ్యారెంటీలను అమలు చేశారు. చేతలతో పాటు మాటలతోనూ రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.