తెలంగా ణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ .. జనంలోకి రాకతప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక.. తప్పదు.. జనంలోకి రావాల్సిందే! అని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నా యి. వాస్తవానికి కేసీఆర్‌కు తుంటి ఆపరేషన్ జరిగింది. దీనికిగాను కనీసం ఆరు మాసాలైనా ఆయన రెస్ట్ తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని మీడియా ముందే వైద్యులు చెప్పారు. దీంతో ఆయన దాదాపు ఇంటికే పరిమితమయ్యారు.
తప్పదు అనుకున్న సమయంలోనే బయటకు వచ్చారు. నల్లగొండలో జరిగిన సమావేశంలో కూడా కేసీఆర్ కూర్చునే ప్రసంగించారు. ఇక, అసెంబ్లీకి అసలు హాజరేకాలేదు. దీనికి రాజకీయపరమైన కారణాల కన్నా కూడా.. ఆరోగ్య సంబంధిత కారణాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో కేసీఆర్.. మరో మూడు మాసాలు రెస్ట్‌లోనే ఉండాలని భావించారు. కానీ, పరిస్థితులు అలా లేవు. కీలకమైన పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ ఎస్ చీకిపోతోంది.
ఎక్కడికక్కడ నాయకులు జారుకుంటున్నారు. కీలక నేతలు గోడలు దూకేస్తున్నారు. వారివెంటే పరివారం కూడా. సో.. ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం.. కేసీఆర్‌పై ఎంతో ఉంది. దీంతో ఆయన ప్రజల్లోకి రావాలని దాదాపు నిర్ణయానికి వచ్చారు. తాజాగా కేసీఆర్ పర్యటనకు సంబంధించి బీఆర్ ఎస్ వర్గాలు షెడ్యూల్ విడుదల చేశాయి. కేసీఆర్ ఆదివారం నుంచి ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాయి. ఆదివారం తొలిరోజు కేసీఆర్ జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు.
అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతా రు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పొలాల పరిస్థితిని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులను ఆకట్టుకోవడం ద్వారా కేసీఆర్ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం గమనార్హం