తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సాగునీటి ప్రాజెక్టులపై నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసన సభ ఆమోదించింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. అయితే, ఇంత కీలకమైన విషయంపై చర్చ జరుగుతున్నా సరే సభకు కేసీఆర్ రాకపోవడంపై సభాధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా నది జలాలకు సంబంధించి, శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైన సందర్భంలో జరుగుతున్న చర్చలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని రేవంత్ ప్రశ్నించారు. హరీష్ రావుతోపాటు బీఆర్ఎస్ సభ్యుల మాటలకు సభలో విలువ లేదని, ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ సభలోకి రాకుండా, ఈ సభలో నదీ జలాలపై జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా ఫాం హౌస్ లో ఎందుకు ఉన్నారని నిలదీశారు. చంద్రశేఖర రావు గారిని సభలోకి రమ్మనాలని, ఆయన వచ్చిన తర్వాత ఎంత సేపు మాట్లాడితే అంతసేపు అవకాశమిస్తామని రేవంత్ చెప్పారు.
ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు కారణమైన పాపాల భైరవుడు సభోలకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేము అందరం కలిసి సమాధానం చెప్తాం అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్లు పోలీసులతో వచ్చి నాగార్జున సాగర్ డ్యాం పై పొజిషన్ తీసుకున్నారని, దాన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అంటూ కేంద్రానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం లేఖ రాయలేదా అని ప్రశ్నించారు.
డిసెంబర్ 1 నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు, వారి ప్రిన్సిపల్ సెక్రెటరీ స్మితా సబర్వాల్ అఫీషియల్ గా కేంద్రానికి లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని ఇన్ని నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ తీసుకొచ్చి బయటపెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే తెలంగాణ నీళ్ల కోసం ఢిల్లీకి వెళ్లి పోరాడుదాం అని బీఆర్ఎస్ సభ్యులు అనడం లేదని మండిపడ్డారు.