ఒకటి తర్వాత ఒకటి చొప్పున నిర్ణయాన్ని తీసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం.. ఈ రోజు (మంగళవారం) హైదరాబాద్ మహానగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లకు సంబంధించి ముగ్గరు కొత్త సీపీలను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ముగ్గురు ఒకరికి మించిన మరొకరు అన్నట్లుగా.. ముక్కుసూటిగా వ్యవహరిస్తారని చెబుతారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? ఏ కమిషనరేట్ కు ఎవరిని సీపీగా నిర్ణయించారన్న విషయానికి వెళితే..
హైదరాబాద్ మహానగర సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమించారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన్ను ఇంతకాలం లూప్ లైన్ లోనే ఉంచారు. ముక్కుసూటిగా వ్యవహరించే తత్త్వంతోపాటు.. ఎవరిని లెక్క చేయని వైనం ఆయన సొంతమని చెబుతారు. ఆయన్ను భరించటం చాలా కష్టమని ప్రభుత్వాధినేతలు భావిస్తుంటారు. అలాంటి ఆయనకు కీలకమైన హైదరాబాద్ సీపీగా పోస్టింగ్ ఇవ్వటం అంటే.. అసలుసిసలు మార్పు అంటే ఏమిటో ఆయన చూపిస్తారని చెబుతున్నారు.
సైబరాబాద్ సీపీగా 2005ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అవినాష్ మహంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ లో అప్రాధాన్య పోస్టులో ఉన్న ఆయన.. సినిమాల్లో చూపించినట్లుగాచిన్నపాటి నిబంధనల ఉల్లంఘనల మీద చండశాసనుడిగా వ్యవహరించే ఆయనకు.. కీలకమైన సైబరాబాద్ కమిషనరేట్ సీపీగా ఇవ్వటం చూస్తే.. సరైన అధికారికి సరైన రీతిలో పోస్టింగ్ ఇచ్చారని చెప్పాలి. సైబర్ నేరాల విషయంలో ఇప్పటికే ఎంతో పని చేసిన ఆయనకు ఇలాంటి కీలక భాద్యతల్ని అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించక తప్పదు.
రాచకొండ సీపీగా 2001 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన జి. సుధీర్ బాబుగా ఎంపిక చేశారు. ఆయనపై కొన్ని ముద్రలు ఉన్నప్పటికీ.. విధి నిర్వహణలో ఆయన అస్సలు తగ్గరని చెబుతారు. సమర్థవంతమైన అధికారిగా ఆయనకు పేరుంది. ఇలా ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా సీపీలు ఎంపిక కూర్పు బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ముక్కుసూటిగా ఉండి.. నిజాయితీగా వ్యవహరించే అధికారులకు.. సిఫార్సులకు షాకిచ్చే వారిని ఉన్నతాధికారులుగా ఎంపిక చేయటం జరగటం లేదు. అందుకు భిన్నంగా తాజా పోస్టింగ్ లు పోలీసు వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సైబరాబాద్ సీపీగా వ్యవహరిస్తున్న స్టీఫెన్ రవీంద్రను.. రాచకొండ సీపీ చౌహాన్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇక.. హైదరాబాద్ పాత సీపీ సందీప్ శాండిల్యను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కు డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.