ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా రాష్ట్ర సీఎం.. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి వ్యక్తిగత జీవితాలన్ని ప్రేమ పెళ్లిళ్లు కావటం రేర్ సీన్ కాక మరేంటి? ఇలాంటి దృశ్యం ఇప్పటివరకు చోటు చేసుకున్నది లేదు. భవిష్యత్తులో రిపీట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. అదే ఈసారి ప్రేమికుల దినోత్సవం స్పెషల్ గా చెప్పాలి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. వీరిలో అత్యధికులు తొలిచూపులోనే ప్రేమలో పడినోళ్లు.
..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రులు రాజనర్సింహ.. కొండా సురేశ్ వీరే కాదు మరికొందరు కాంగ్రెస్ నేతల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఒక సారూప్యత ఉంది. అది.. వారందరిది ప్రేమ వివాహమే. ఈ రోజున (ఫిబ్రవరి 14) ప్రేమికుల దినోత్సవం. ఇలాంటి వేళ.. పాలకులుగా అత్యున్నత స్థానాల్లోని ప్రముఖులంతా ప్రేమకు బందీలైన వారే కావటం ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఈ స్థాయిలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న ప్రముఖులు పాలక వర్గంగా ఉండటం గతంలో మరెప్పుడూ చోటు చేసుకోలేదనే చెప్పాలి.సగటు ప్రేమికుల మాదిరే ఈ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోని ప్రేమకథల్లోనూ బోలెడన్ని ట్విస్టులు.
ప్రజాప్రతినిధులుగా.. రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే వారుగా ప్రజలకు సుపరిచితులైనప్పటికి వారి వ్యక్తిగత జీవితాల్లో మాత్రం వారిలోని ప్రేమికుడు కనిపిస్తాడు. విద్యార్థి దశలోనే ప్రేమలో పడి.. పెద్దలకు మెప్పించి.. ఒప్పించి పెళ్లాడిన ఈ ప్రముఖులు తమ ప్రేమను జాయించిన వీరులుగా చెప్పాలి. రాజకీయాల్లో మునిగితేలుతూ.. ప్రజాసేవలో ఉన్నప్పటికీ తమ ప్రేమ ప్రయాణాన్ని విజయవంతంగా కంటిన్యూ చేస్తున్న వారిని చూస్తే వావ్ అనుకోకుండా ఉండలేం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చదువుకునే రోజుల్లో ప్రేమించిన గీతారెడ్డిని పెళ్లాడారు. వీరిద్దరి లవ్ ఒక బోటులో మొదలైంది. ఇంటర్ చదివే రోజుల్లో నాగార్జునసాగర్ వెళ్లిన రేవంత్.. బోటులో గీతను మొదటిసారి చూశారు. ఆమె కుటుంబ వివరాలు తెలుసుకునే క్రమంలో పరియం కాస్తా స్నేహంగా మారింది. గ్రీటింగ్ కార్డుల్ని స్వయంగా తయారు చేసి మరీ రేవంత్ ఆమెకు పంపేవారు. ఇద్దరి మధ్య మొదలైన ప్రేమను తొలిసారి బయటపెట్టింది మాత్రం రేవంత్ రెడ్డే.
రేవంత్ వ్యక్తిత్వం.. ముక్కుసూటితనం నచ్చిన గీత ఆయన ప్రేమకు ఓకే చెప్పారు. కొన్నాళ్ల తర్వాత పెద్దల వద్దకు ఈ వ్యవహారం వెళ్లటం.. వారు నో చెప్పి.. ఆమెను దూరంగా పంపారు. కొంతకాలం దూరంగా ఉన్నా.. తర్వాతి రోజుల్లో రేవంత్ స్వయంగా ఆమె తరఫు పెద్దలతో మాట్లాడి తన ప్రేమను గెలిపించుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవటంతో వారిద్దరి వివాహబంధం 1992లో షురూ అయ్యింది.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సుపరిచితులు భట్టి విక్రమార్క ఒక రాజకీయ నేతగా అందరికి తెలుసు. ఆయన వ్యక్తిగతజీవితం.. అందునా ఆయనది ప్రేమ వివాహం అన్న విషయం తక్కువ మందికి తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చదువుతున్నారు భట్టి విక్రమార్క. ఆ టైంలో వర్సిటీ ఆడ్మిషన్ కోసం వచ్చినప్పుడు పరిచయమయ్యారు. తొలిచూపులోనే ఆమెను ఇష్టపడిన భట్టి తన ప్రేమను మనసులో దాచుకున్నారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఉత్తరాది సంప్రదాయ కుటుంబానికి చెందిన నందిని అప్పట్లో వర్సిటీలో ఆడ్మిషన్ తీసుకోలేదు. అయితే.. వారి పరిచయం అలానే ఉండిపోయింది. కాలక్రమంలో వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల్లోని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న దామోదర్ రాజనర్సింహది తొలిచూపు ప్రేమే. సినిమాల్లోనూ..కథల్లో మాదిరి. ఆయన ఇంజినీరింగ్ చదివే వేళలో నిజామాబాద్ లోని ఫ్రెండ్ పెళ్లికి వెళ్లారు. అక్కడ పెళ్లి కుమార్తె బంధువైన పద్మినీరెడ్డిని చూసి మనసు పడ్డారు. తర్వాత కొంతకాలానికి తన ప్రేమను ఆమెకు తెలియజేయటం.. అందుకు ఆమె ఓకే చెప్పటంతో పెద్ద వారి వద్దకు వీరి వ్యవహారం వెళ్లింది. చిన్న చిన్న వివాదాలు తలెత్తాయి. చివరకు స్నేహితుల సహకారంతో వారిద్దరు 1985లో పెళ్లి చేసుకోగా.. పెద్దలు తర్వాత ఒప్పుకున్నారు.
తెలంగాణ దేవాదాయ శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ.. మురళీధర్ రావులదీ లవ్ మ్యారేజే. వరంగల్ ఎల్బీ కాలేజీలో బీకాం చదివే రోజుల్లో మురళీకి.. సురేఖకు పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటంతో సురేఖను మురళీధర్ రావు తిరుపతికి తీసుకెళ్లి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరే కాదు.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద -సరోజ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ – రమ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి – నీలిమ, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం -నీలిమ, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి – దయానంద్ దంపతులు కూడా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారే కావటం విశేషం.