ఇంకేముంది.. త్వరలోనే విశాఖకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లిపోతున్నారు. అక్కడి నుంచే పాలన ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వకార్యాలయా లన్నీ కూడా అక్కడికి వెళ్లిపోతున్నాయి.. అని వైసీపీ నాయకులు… సీఎం సహా మంత్రులు వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. రాజధాని కేసులు కోర్టుల్లో పెండింగులో ఉండగా.. ఇలా ఎలా సాధ్యమంటూ ప్రజాసంఘాలు, అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కోర్టులోనూ వారు సవాల్ చేస్తున్నారు. తాజాగా హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిగింది.
అయితే.. బయట ఇంకేముంది.. విశాఖకు వెళ్లిపోతున్నామని చెబుతున్న ప్రభుత్వం హైకోర్టులో మాత్రం యథాతథంగా `అలాంటిదేమీ లేదు అంతా తూచ్` అంటూ బొంకేసింది. అమరావతి నుంచి విశాఖపట్నానికి క్యాంపు ఆఫీస్ల ముసుగులో రాజధాని తరలింపు పిటిషన్పై మంగళవారం ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రాజధాని ఆఫీసులు ప్రస్తుతం తరలించడం లేదని.. ఆఫీస్లు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమేనని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది.
పిటిషన్ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని న్యాయవాది కోరారు. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం నుంచి.. స్పష్టత ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఆఫీస్లు తరలించడం లేదని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం సమాచారమిచ్చింది. కేసు విచారణను వచ్చే సోమవారానికి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కార్యాలయాల ఏర్పాటు కోసం.. భవనాలు చూడాలంటూ.. ఏకంగా జీవోనే ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా కోర్టుకు దాస్తున్న సర్కారు.. ఏమీ లేదని చెప్పడం గమనార్హం.