ఈ మధ్య కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు వంటి ఘటనలపై కొందరు రాజకీయ నాయకులు స్పందిస్తున్న తీరు వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి వ్యాఖ్యలు చేసి వివాదాలకు కేంద్ర బిందువులుగా మారడంలో బీజేపీ నేతలు ముందు వరుసలో ఉంటారు. అయితే, తాజాగా బీజేపీ నేతల దారిలోనే ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరడం చర్చనీయాంశమైంది.
ఓ అత్యాచార ఘటన విషయంపై దీదీ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. బెంగాల్ లోని హాష్ కాలిలో ఓ మైనర్ ను రేప్ చేసి మర్డర్ చేశారని వచ్చిన ఆరోపణలపై దీదీ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఆ మైనర్ అత్యాచారం వల్ల చనిపోయిందని ఎలా అంటారని దీదీ ప్రశ్నించడం వివాదానికి దారి తీసింది. ఆమె గర్భవతా లేక ప్రేమ వ్యవహారం నడుపుతోందా? అని పోలీసులు విచారణ జరిపారని, సదరు బాలుడితో ఆ బాలికకు అఫైర్ ఉందని వారు తనతో చెప్పారని దీదీ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది.
ఇది కచ్చితంగా ప్రేమ వ్యవహారమేనని, ఆ విషయం ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలుసని దీదీ అన్నారు. ఏ జంట అయినా ఒక బంధంలో ఉంటే తాను ఆపగలనా? అంటూ దీదీ ఎదురు ప్రశ్నించారు. ఇది యూపీ కాదని, తాము లవ్ జిహాద్ ను చేయబోమని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రేమ వ్యవహారం వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని, ఏదైనా తప్పు జరిగితే నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తారని, ఒక అనుమానితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారని మమత అన్నారు.
ఈ క్రమంలోనే దీదీ కామెంట్లపై బీజేపీ నేతలతో పాటు పలువురు మండిపడుతున్నారు. ఆ రేప్ కేసులో సీఎం నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఊహించలేనంత అభ్యంతరకరమైన, సున్నితమైనవని ప్రముఖ సినీ నిర్మాత శ్రీజిత్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. మాటలు రాలేక నోరు మూగబోయిందంటూ శ్రీజిత్ ట్వీట్ చేశారు. మహిళ అయి ఉండి, అత్యాచారాలను దాచి పెడతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
పదేళ్ల క్రితం 2012లోనూ పార్క్ స్ట్రీట్ అత్యాచారం కేసులో దీదీ ఇలానే మాట్లాడారని, బాధితురాలిని సెక్స్ వర్కర్ అంటూ తృణమూల్ ఎంపీలు విమర్శించారని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. అయితే, ఆ కేసులో ఆరోపణలు నిజమై నిందితులు జైలుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం నుంచి అటువంటి స్పందన రావడం భయంకరమని ప్రతిపక్ష నేత సువేందు అధికారి విమర్శించారు.