దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2న లొంగిపోవాలని తన ఉత్తర్వుల్లో దేశపు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఎన్నికల వేళ కేజ్రీవాల్ బెయిల్ వార్త ఆప్ శ్రేణులకు భారీ ఉపశమనమిచ్చినట్లయింది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ‘సత్యమేయ జయతే’ అంటూ ఆప్ నేతలు నినదించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ కస్టడీ కోర్టు మరోసారి పొడిగించింది. తాజాగా కేజ్రీవాల్ కు బెయిల్ లభించినా ఈ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మాత్రం బెయిల్ లభించలేదు.
కేజ్రీవాల్ బెయిల్ నకు షరతులివే…
1. జైలు నుంచి విడుదలకు ముందు రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాలి.
2. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్ వెళ్లవచ్చు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ, సెక్రటేరియట్‌కు కానీ వెళ్లరాదు.
3. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ఏ అధికారిక ఫైల్ మీద కేజ్రీవాల్ సంతకం చేయరాదు.
4 .ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి కానీ, తనపై ఉన్న అభియోగాలపై కానీ కేజ్రీవాల్ మాట్లాడరాదు.
5. మధ్యం పాలసీ కేసులో సాక్షులతో మాట్లాడకూడదు.
6. జూన్ 2వ తేదీన తిరిగి కోర్టుకు లొంగిపోవాలి.