గుజరాత్ అంటేనే.. ప్రధాని నరేంద్ర మోడీ అడ్డా! దాదాపు నాలుగు సార్లుగా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తోంది. ఇదంతా కూడా మోడీ.. అమిత్‌షాల కృషేనని అందరూ అంటారు. పైగా కాంగ్రెస్‌ను కూడా దాదాపు ఇక్కడ అడ్రస్ లేకుండా చేయాలని నిర్ణయించుకుని ఆదిశగా అడుగులు వేస్తున్నారు. మోడీ.. ప్రధానిగా ఢిల్లీలో ఉన్నా.. గుజరాత్ రాజకీయాలపై ఆయన ఆలోచన లు చేస్తూనే ఉన్నారు. అయితే.. తాజాగా గుజరాత్లో.. మోడీ, అమిత్‌షాలకు బద్ధ శత్రువు పాగావేశారు. ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
ఆది నుంచి కూడా మోడీ, షాలపైనే కాకుండా.. బీజేపీకి చుక్కలు చూపిస్తూ.. ఢిల్లీలో రెండోసారి అధికారం దక్కించుకున్న కేజ్రీవా ల్.. తాజాగా గుజరాత్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తన సత్తా చూపించారు. కేజ్రీవాల్ పార్టీ.. ఆమ్ ఆద్మీ.. గుజరాత్లో భారీగా పుంజుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌లోని ఆరు కార్పొరేషన్లలో 470 మంది అభ్యర్థులను నిలిపింది. సూరత్‌లో 27 స్థానాలను దక్కించుకుంది. నిజానికి బీజేపీకి కంచుకోటలైన ఆ స్థానాల్లో ఆమ్ ఆద్మీ గెలుపు గుర్రం ఎక్కడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో పర్యటించబోతున్నారు.
గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ మంగళవారం ఓ ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో నూతన రాజకీయాల శకానికి నాంది పలికారని అభినందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం, కేజ్రీవాల్ ఈ నెల 26న సూరత్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. తమ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా పట్ల నమ్మకం ప్రకటించిన గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు చెబుతారని తెలిసింది. గ్రాండ్ రోడ్ షోను నిర్వహిస్తారని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ పరిణామం.. నిజానికి ప్రధాని మోడీ సహా కేంద్ర హోం మంత్రి షాలకు పెద్ద చిక్కే తెచ్చిపెడుతుందని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఈ 26 మందిని తమవైపు లాక్కునేందుకు ప్రయత్నించే అవకాశం లేదని మరికొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా భవిష్యత్తును పక్కన పెడితే.. ఇప్పటి వరకు అయితే.. కేజ్రీవాల్ మోడీకి షాకిచ్చారనే చెప్పాలి.