2019 ఎన్నికలకు ముందు తెలంగాణలో టీఆర్ఎస్ హవా సాగిన సంగతి తెలిసిందే. అయితే, దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితోపాటు బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ తగలడంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. టీఆర్ఎస్ కు గట్టిపోటీనిస్తోన్న బీజేపీకి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్….కాంగ్రెస్, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని, హద్దు మీరితే తొక్కిపడేస్తాం జాగ్రత్త అంటూ సీరియస్ టోన్ లో కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా కాంగ్రెస్ కు లేదని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా దోపిడీ చేసి ఇప్పుడు నీతులు చెపుతున్నారని మండిపడ్డారు.
కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న రీతిలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లలా మాట్లాడడం తమకూ వచ్చని, తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదని హెచ్చరించారు. తమకు ప్రజలు పట్టం కట్టారని, ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదని చురకలంటించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు, ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ అని, రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్ నేతలు అని నిప్పులు చెరిగారు.
కమీషన్ల కోసమే ప్రాజెక్ట్లు కట్టామని విమర్శిస్తున్నారని, అలా అయితే మీరు నాగార్జునసాగర్ కమీషన్ల కోసమే కట్టారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఏపీకి అనుకూలంగా ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదని, నల్గొండ ఫ్లోరైడ్ సమస్య గురించి ఒక్కరూ మాట్లాడలేదని దుయ్యబట్టారు. తమ హయాంలో రైతుబంధు, రైతుబీమా వస్తుందన్నందుకు పోరుబాట పడతారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో కనీసం ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదని, విజయడెయిరీ మూసివేస్తే కాంగ్రెస్ నేతలు నోరు తెరవలేదని విమర్శించారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు. తమది నామినేటెడ్ ప్రభుత్వం కాదని, ప్రజా ప్రభుత్వమని అన్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఉచితంగా కేసీఆర్ కిట్లు ఇస్తున్నామని చెప్పారు.
పోడు భూముల సమస్య పరిష్కారానికి జిల్లాల్లో పర్యటిస్తానని కేసీఆర్ చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్ లో దళితుల కోసం ప్రత్యేక కేటాయింపులు చేస్తామని, సీఎం దళిత ఎంపవర్ మెంట్ పేరుతో వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు. తన మాటలు అబద్ధమైతే నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ ను ఓడించాలని, నిజమని నమ్మితే ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.