తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు జోరుగా వైరల్ అవుతున్నాయి. వీటికి నెటిజన్ల నుంచి అంతే రేంజ్లో కామెంట్లు కురుస్తున్నాయి. ఇంతకీ కేసీఆర్ ఏమన్నారంటే..
కేసీఆర్ కామెంట్ 1: తెలంగాణ ప్రజలు తన మీద ఉంచిన విశ్వాసం, అభిమానమే కొండంత ధైర్యమని.. ప్రజలిచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేంత వరకు తాను విశ్రమించేది లేదని అన్నారు.
నెటిజన్ల కామెంట్: తెలంగాణ వచ్చిన ఏడాదిలోనే బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతానన్న కేసీఆర్.. ఏడేళ్లు పూర్తయినా.. ఇంకా అదే కామెంట్ ఎలా చేస్తారు. ఇంకెన్నేళ్లు పడుతుంది సార్ బంగారు తెలంగాణ చూసేందుకు?!(ఎక్కువ మంది సంధించిన ప్రశ్న ఇదే)
కేసీఆర్ కామెంట్ 2: సమైక్య రాష్ట్రంలో విస్మరించిన రంగాలను ఒక్కొక్కటిగా ఓపిక, దార్శనికతతో అవాంతరాలు ఎదురైనా సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు.
నెటిజన్ల కామెంట్ 2: సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు.. ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు. ఉపాధి కరువైంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ఎక్కడి అభివృద్ధి అక్కడే ఉంది. మరి ఏయే రంగాలను మీరు ఓపిక, దార్శనికతతో సరిదిద్దుతున్నారు సార్?
కేసీఆర్ కామెంట్ 3: ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశం గర్వించే రీతిలో నిలబెట్టుకున్నం. ఏడేండ్లలోనే దృఢమైన పునాదులతో సుస్థిరత చేకూరడం సంతోషంగా ఉంది. ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సాగు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం రోడ్లు తదితర మౌలిక వసతులను స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో చేస్తున్నం. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైనా అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.
నెటిజన్ల కామెంట్ 3: ఎవరు అభివృద్ధి చెందారు సార్? ఎవరికైనా పట్టుమని ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చారా? మౌలిక సదుపాయాలు ఎవరికి చేరుతున్నాయి? ఏ విషయంలో తెలంగాణ ఆదర్శంగా ఉంది? కుటుంబ పాలనలోనా?
కేసీఆర్ కామెంట్ 4: తెలంగాణలో 90శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందినవారే ఉండటంతో వారి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నం.
నెటిజన్ల కామెంట్ 4: ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇప్పటికీ అణగారిన స్థితిలోనే ఉన్నారు. వారికి కేటాయించిన నిధులు ఏమయ్యాయో చెప్పేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదేంది సార్.. అభివృద్ధి?!
కేసీఆర్ కామెంట్ 5: తెలంగాణ రైతాంగాన్ని కాపాడి సాగుకు పునరుజ్జీవం కల్పించి.. దేశానికే రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాం.
నెటిజన్ల కామెంట్ 5: ఇంకెప్పుడు కేసీఆర్ సార్? కొత్త రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు పూర్తాయె. మరి అన్నపూర్ణగా ఎప్పుడు నిలుపుతారు?
.. ఇలా అనేక రూపాల్లో నెటిజన్లు కేసీఆర్ కామెంట్లకు ట్రోల్స్ చేస్తుండడంగమనార్హం. మరి దీనికి అధికార పార్టీ తరఫున ఎవరు సమాధానం ఇస్తారో చూడాలి.