కేంద్రంలో మోడీ సర్కార్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ తలపడుతున్న సంగతి తెలిసిందే. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఆ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్ అనే నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.
మెరుగైన పనితీరు కనబరిచిన వారికే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని కేసీఆర్ అన్నారు. అదే సమయంలో పార్టీ శ్రేణులలో అసంతృప్తి లేకుండా చూసుకోవాలని సూచించారు. పార్టీ కోసం అవసరమైతే సొంతగా ఓ టీవీ ఛానల్ నడపాలని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అందుకోసం పార్టీ శ్రేణులు ముమ్మరంగా టీవీ ప్రకటనలు, ఫిలిం ప్రొడక్షన్ వంటి పనులు చేపట్టాలని సూచించారు.
ప్రజలతో మాస్ కమ్యూనికేషన్ పెంచుకోవాలని, ప్రభుత్వ పథకాల గురించి, సంక్షేమ ఫలాల గురించి భారీ స్థాయిలో ప్రచారం చేసి ప్రజలకు వివరించాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుతాం అనే కాన్సెప్ట్ నేటి రాజకీయాలకు అసలు పనికిరాదని హితవు పలికారు. దేశంలో మతతత్వ శక్తులు విద్వేషాగ్నులను రెచ్చగొడుతున్నాయని అన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.