2024 ఎన్నికలలో మోడీ ఓటమే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ కొద్ది రోజులుగా వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఆ టూర్ లు ముగించుకొని వచ్చిన తర్వాత కేసీర్ బడ్జెట్ వ్యవహారాలలోనూ తలమునకలయ్యారు. ఇలా, వరుస పర్యటనలు, సమీక్షలు, సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ తాజాగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
శుక్రవారం ఉదయం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్ కు ఛాతీలో స్వల్పంగా నొప్పి రావడంతో హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేసిన వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. గత రెండ్రోజులుగా నీరసంగా ఉన్న కేసీఆర్…తన ఎడమ చేయి లాగుతోందని తమతో చెప్పినట్లు యశోదా ఆస్పత్రి వైద్యుడు ఎన్వి రావు వెల్లడించారు. అయితే, కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నామని, వాటి నివేదికలు వచ్చిన తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి శుక్రవారం ఉదయం కేసీఆర్ సతీసమేతంగా యాదాద్రిలో పర్యటించి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాల్సి ఉంది. యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు జరగనున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకళ్యాణ వేడుకలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దాంతోపాటు, ఈ నెల 28న యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభ కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే, హఠాత్తుగా కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో ఈ పర్యటన ఆఖరి నిమిషంలో రద్దయింది.