తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2023 లో జరిగే సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దింపి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బిజెపి… తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను దాదాపు చావుదెబ్బ కొట్టినంత పని చేసింది. తర్వాత దుబ్బాక – హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ సంచలన విజయాలను నమోదు చేసింది.
బిజెపి తనకు చాపకింద నీరులా ఎర్త్ పెడుతోన్న విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తోన్న కేసీఆర్ ముందు నుంచి వేచి చూసే ధోరణి తోనే ఉంటున్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉందని.. కేంద్ర ప్రభుత్వంతో అనవసర వివాదాలు ఎందుకని ? ఎదురు చూస్తూ వచ్చిన కేసీఆర్ ఇక ఇప్పుడు బిజెపితో చేతులు కట్టుకుని ఉంటే మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని గ్రహించారు.
అందుకే ఆయన ఎన్డీఏ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణలో వరి కొనుగోలు వివాదం కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఒకరిపై మరొకరు నెట్టేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. రెండు మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి మరీ వడ్లు కొనుగోళ్లుపై తేల్చుకుని వస్తామని చెపుతున్నారు.
కేంద్ర మంత్రులతో పాటు అవసరమైతే ప్రధానిని కూడా కలుస్తామని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. కేసీఆర్ మరో అడుగు ముందుకు వేసి కేంద్రపై ఘాటైన వ్యాఖ్యలే చేశారు. సాగు చట్టాలను మోడీ వెనక్కు తీసుకోవడం వెనక రైతుల పోరాటం ఫలించిందన్నారు. ఉద్యమంలో మరణించిన ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం రు. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున రు. 3 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటన చేశారు.
రైతులపై పెట్టిన దేశ ద్రోహం కేసులు కూడా వెంటనే ఉపసంహారించు కోవాలని డిమాండ్ చేశారు. ఇక జల వివాదాల పరిష్కారం కోసం కూడా కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తామని కేసీఆర్ చెపుతున్నారు. తమ రాష్ట్ర జలవాటా కోసం వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తేల్చాలని.. లేకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాని ఘాటుగా చెపుతున్నారు. మరి కేసీఆర్ ఇక్కడ చూపించిన ఆవేశమే ఢిల్లీలో ప్రభుత్వ పెద్దల దగ్గర చూపుతారా ? లేదా అక్కడ సైలెంట్‌గా సంధి అంటారా ? చూడాలి.