అధికారం దక్కించుకోవడం ఓ పద్ధతి. నిలుపుకోవడం కష్టంతో కూడిన పద్ధతి. అయినా పద్ధతి ప్రకారం పాలన ఉంటే మళ్లీ పద్ధతి ప్రకారమే జగన్ అధికారంలోకి రావడం ఖాయం. ఈ మూడేళ్లలో ఆయనేం చేశారు అన్నది చూద్దాం. ముఖ్యంగా ఆయన అధికారంలోకి రాగానే వలంటీర్లను నియమించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సన్నద్ధం అయ్యారు. ఆ మేరకు లక్షకు పైగా పోస్టులు భర్తీ చేశారు. కరోనా కు సంబంధించిన రెండేళ్లలోనూ గ్రామ సచివాలయాలే కొన్ని మంచి సేవలు అందించాయి కూడా! కాదనలేం. వ్యాక్సినేషన్ ప్రాసెస్ సక్సెస్ కావడానికి కారణమే వలంటీర్లు మరియు ఇతర వైద్య విభాగ సిబ్బంది.
జగన్ ముందుగానే చెప్పిన విధంగా నవరత్నాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని వర్గాలకూ మేలు చేయాలన్న తలంపుతో లక్ష కోట్లకు పైగా సంక్షేమానికే వెచ్చించారు. ఇది ఓ విధంగా ఆర్థిక సంక్షోభానికి కారణం అయినా ఆయన పట్టించుకోలేదు. విడిపోయిన నాటికి మన అప్పు లక్ష కోట్లు అయితే ఇప్పుడు మన అప్పు 9 లక్షల కోట్లు దాటిపోయింది. ఓ విధంగా జగన్ దిగిపోయే నాటికి మన అప్పులు 12 లక్షల కోట్లు దాటిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుల విషయమై వైసీపీ చెప్పినవేవీ సమంజసంగా లేవు. ఇప్పటిదాకా ఉన్నవివరం ప్రకారం మొత్తం అప్పు : 9.10 లక్షల కోట్లు + 3.18 లక్షల కోట్లు = 12.28 లక్షల కోట్లు (2024 వరకూ)
ఇక ముందు చెప్పుకున్న విధంగానే సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆరోపణలు అయితే ఆయన మోస్తున్నారు. ఇదేమని అడిగితే తాము ముందు నుంచి చెప్పిన విధంగా సంక్షేమరంగమే ధ్యేయం అని చెబుతున్నారు. అదేవిధంగా సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోలేదు. ఎట్టకేలకు కొన్నింటి నిర్వహణకు అరకొర నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అన్న విమర్శ కూడా ఉంది. ప్రాధాన్యం ఉన్న రంగాలకు నిధులు లేకపోవడం జగన్ చేస్తున్న లేదా చేయబోతున్న ప్రధాన తప్పిదం. వీటిని అధిగమించేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తే మేలు.