అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయకూడదు అని కాదు. చేసిన తప్పులు దిద్దుకోవడం అన్నదే ఓ బాధ్యత. ఆవిధంగా ఆ రోజు మద్యపాన నిషేధానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన జగన్ తరువాత కాలంలో ఆ ఊసే మరిచిపోయారు. నిషేధం స్థానంలో నియంత్రణ అన్న పదం వచ్చి చేరింది. అంటే ఏంటి అర్థం ఇకపై నిషేధం అన్నది మా వల్ల కాదు కనుక నియంత్రణ అన్నదే మా ప్రభుత్వంలో సాధ్యం అని చెబుతూ, జనాభా ప్రాతిపదికన బార్ల ఏర్పాటుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ, సంబంధిత లైసెన్సుల వేలం అన్నవి చకచకా జరిగిపోయాయి.
మూడేళ్ల కాలంలో ఏ శాఖకూ దరఖాస్తుల రూపంలోరానంత ఆదాయం కేవలం బార్ల కు సంబంధించే ఎక్సైజ్ శాఖకు రావడం విశేషం. ఆ విధంగా చూసుకుంటే నూట ఇరవై కోట్ల రూపాయలు కేవలం దరఖాస్తుల రూపంలోనే ఖజానాకు చేరింది. అదేవిధంగా లైసెన్సుల వేలంతో ప్రభుత్వానికి ఐదు వందల 97 కోట్ల రూపాయలు వచ్చింది. అంటే మొత్తంగా ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఏపీ ఖజానాకు వచ్చి చేరింది.
ఇలాంటి దశలో జగన్ సర్కారు పై వ్యతిరేకత పెరుగుతుందా ? తగ్గుతుందా ? అంటే తగ్గుతుందనే చెప్పాలి.ఆ రోజు చెప్పిన మాటలేవీ తరువాత కాలంలో ఆచరణీయం కాకపోగా, కేవలం మద్యంపై వచ్చే ఆదాయాలతో ప్రభుత్వాన్ని తాము నడపగలం అని పదే పదే నిరూపణ చేశారు వైఎస్ జగన్. ఇదే విషయమై టీడీపీ కనుక ఓ స్పష్టమైన విధానంతో ప్రజా వ్యతిరేకతను కూడగట్టిందే మంచి ఫలితాలే వస్తాయి. ముఖ్యంగా గ్రామాల్లో కల్తీ మద్యం ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యం లో పట్టణాల్లో కూడా ఇదే తంతు నెలకొని ఉంది. వీటితో పాటు మద్యం మరింత విరివిగా లభ్యం అయ్యే విధంగా బార్ల ఏర్పాటకు గేట్లు బార్లా తెరుచుకోవడం ప్రజాగ్రహానికి మరో కారణం తప్పక అవుతుంది.
నివాస యోగ్యత ఉన్న ప్రాంతాలలో కూడా బార్ల ఏర్పాటుకు ముందూ వెనుకా చూడకుండా అనుమతులు ఇచ్చేశారు అన్న వార్తలూ అందుతున్నాయి.ఇటువంటి దశలో మద్య నిషేధం పై కానీ సారా అమ్మకాలపై కానీ మరో ప్రజా ఉద్యమం కనుక టీడీపీ చేయగలిగితే మంచి ఫలితాలే వస్తాయి.ముఖ్యంగా బార్ల ఏర్పాటు అంతా వైసీపీ నాయకుల ఖాతాల్లోకే వెళ్లిపోయాయి అన్నవార్తలకు తగినన్ని ఆధారాలు కూడా ఇవాళ మాధ్యమాల్లో కథనాల రూపంలో వెల్లడిలో ఉన్నాయి.
కనుక వీలైనంత వరకూ రానున్న వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీలో ఇదే విషయంపై టీడీపీ చర్చకు పట్టుబట్టి అసలు మద్య నిషేధంపై ప్రభుత్వం విధానం ఏంటన్నది స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు.ఇదే సమయంలో అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సమయంలోనే జిల్లాలలో బార్ల ఏర్పాటుపై, అదేవిధంగా కల్తీ మద్యం అమ్మకాలపై ముఖ్యంగా ఆ రోజు చెప్పిన మద్య నిషేధంపై ఉద్యమాలు చేయవచ్చు.ఇవన్నీ టీడీపీ చేయగలిగితే మళ్లీ అధికారం చంద్రబాబుదే!
Comments 1