సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా? లేదా? ఒక వేళ జగన్ బెయిల్ రద్దయితే ఏపీకి కాబోయే సీఎం ఎవరు? కాలం ఖర్మం కలిసిరాక మరోసారి జగన్ జైలుకు వెళితే ఏపీలో వైసీపీ పరిస్థితి ఏమిటి? జగన్ జైలుకు వెళితే పార్టీకి డ్యామేజా? మైలేజా? గత కొద్ది రోజులుగా ఏపీలోని రాజకీయ విశ్లేషకులు మొదలు గ్రామాల్లోని రచ్చబండ దగ్గర కూర్చొని పిచ్చాపాటీ మాట్లాడే సామాన్యుల వరకు ఇదే విషయంపై చర్చోపచర్చలు జరుపుగున్నారు.
ఈ చర్చలు, రచ్చబండలు, విశ్లేషణలు ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నేడు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై మరోసారి కోర్టు విచారణ జరిపింది. నేడు ఈ పిటిషన్ పై సీబీఐ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కోర్టు విచక్షణ అధికారాలకే ఈ పిటిషన్ పై నిర్ణయం వదిలేశామంటూ గతంలో దాఖలు చేసిన మెమోను పరిగణించాలని వారు కోరారు.
ఈ కేసులో జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు ఆల్రెడీ లిఖిత పూర్వక వాదనలు సమర్పించగా, తాజాగా సీబీఐ కూడా తమ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు విషయంలో నిర్ణయాన్ని కోర్టు విచక్షణాధికారానికి వదిలేస్తున్నామని, బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న దానిపై న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని సీబీఐ తమ రిజైండర్లో పేర్కొంది. ఈ విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని ఈరోజు సీబీఐ తరపు న్యాయవాదలు వాదనలు వినిపించారు.
ఈ నేపథ్యంలో ఈ మూడింటిని పరిగణలోకి తీసుకున్న నాంపల్లి సీబీఐ కోర్టు…ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. అదే రోజున జగన్ భవితవ్యం తేలనుందని, జగన్ కు బెయిలా? జైలా? అన్నది ఆ రోజే తేలే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ రోజైనా జగన్ బెయిల్ రద్దు వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.