ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబరులోనే విశాఖ ఉక్కును అమ్మేందుకు పోస్కోతో జగన్ బేరం కుదుర్చుకున్నారని, ఇపుడు ప్రజా వ్యతిరేకత రావడంతో యూటర్న్ తీసుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనాన్ని మభ్యపెట్టడానికి కేంద్రానికి లేఖలు రాసిన జగన్…కంటి తుడుపు చర్యల కింద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులతో చర్చలు జరిపారని దుయ్యబడుతున్నారు.
విశాఖ ఉక్కు వ్యవహారం బెడిసికొట్టడంతో తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి పోస్కో ప్రతినిధులను ఆహ్వానించామంటూ జగన్ సర్కార్ చెబుతోందని అంటున్నారు. అయితే, వాస్తవానికి గత ఏడాది విశాఖ ఉక్కుకు సంబంధించి కుదుర్చుకున్న డీల్ ను రద్దు చేసి …కృష్ణపట్నం పోర్టు డీల్ ఫైనల్ చేసేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ ల నేపథ్యంలోనే రేపు జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్ రేపు హస్తినలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లనున్న జగన్….రేపు రాత్రి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, కృష్ణపట్నం పోర్టులో పోస్కో ఫ్యాక్టరీ నిర్మాణం, మూడు రాజధానుల అంశం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, పెండింగ్ ప్రాజెక్టులు, తాజా రాజకీయ పరిస్థితులు, షర్మిల కొత్త పార్టీ, తిరుపతి ఉప ఎన్నిక వంటి కీలక అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో మూడు సార్లు షాతో భేటీ అయిన జగన్…వరుసగా నాలుగో సారి భేటీ కాబోతుండడం విశేషం.