ఏపీలో ఓ వైపు పంచాయతీ ఎన్నికల పోలింగ్ హడావిడి మొదలు కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రేపు జరగనున్న తొలి విడత పోలింగ్ కోసం ఎస్ఈసీ, అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై నిరసనలు మిన్నంటుతున్నాయి. విశాఖ ఉక్కును అమ్మాలనుకోవడంపై కార్మిక సంఘాలు, పలు పార్టీల నేతలు, అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన చరిత్ర ముఖ్యమంత్రి జగన్ దని, జగన్ కు ప్రధాని మోడీ పెద్ద లెక్క కాదని అమర్ నాథ్ షాకింగ్ కామెంట్లు చేశారు. 32 మంది ప్రాణ త్యాగంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నామని, దానిని మోఢీలాంటి వ్యక్తి వచ్చి ప్రైవేటీకరిస్తాం, అమ్మేస్తాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పై వైసీపీ స్పష్టమైన వైఖరితో ఉందని, ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోడీకి జగన్ లేఖ రాశారని అమర్ నాథ్ గుర్తు చేశారు.
పోరాటాలు చేయడం జగన్ కు కొత్త కాదని, ఒకవేళ జగన్ రాసిన లేఖను పరిగణించకుండా కేంద్రం మొండి వైఖరితో ముందుకు సాగితే తిరగబడతామని అమర్ నాథ్ హెచ్చరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నేతలు, పలు పార్టీల నేతలతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీపై అమర్నాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో, అమర్ నాథ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రధాని మోడీకి జగన్ లేఖ రాయడం, విశాఖ ఉక్కును ఏపీ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ప్రయత్నిస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటన ఇవ్వడంతో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందేమోనన్న ఆశతో ఉన్న ఏపీ ప్రజలకు అమర్ నాథ్ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. మోడీ అంటే జగన్ కు లెక్క లేకుంటే విశాఖ ఉక్కుపై విన్పపాలు చేసేవారు కాదని…రోడ్ల మీదకు వచ్చి ముందుండి కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవారని అంటున్నారు. మోడీ అంటే బెంగాల్ సీఎం మమతకు లెక్క లేదని, కాబట్టే ఆమె చేసే ప్రకటనలు, చర్యలు కూడా అలాగే ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో జగన్ ప్రకటనలు, చర్యలు…మోడీకి, బీజేపీ సర్కార్ కు అనుకూలంగా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు మోడీకి జగన్ వంగి వంగి దండాలు పెడుతూ, విన్నపాల లేఖలు రాసుకుంటూ ఉంటే…మరోవైపు వైసీపీ నేతలేమో మోడీకి జగన్ భయపడరు….మోడీని లెక్క చేయరంటూ సినిమా డైలాగులు చెబితే జనం నమ్మే పరిస్థితిలో లేరని అంటున్నారు. మరి, అమర్ నాథ్ వ్యాఖ్యలు ఇటు ప్రభుత్వానికి, తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానికి మోకాలడ్డి ఏపీ ప్రజలకు అన్యాయం చేసేలా ఉన్నాయని చెబుతున్నారు.