తిరుపతి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్, వైసీపీ నేతల వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. లడ్డూలో కల్తీని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా అని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీకి ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని, అయినా సరే వైసీపీ నేతల బుద్ధి మారలేదని ఎద్దేవా చేశఆరు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తానని, స్వామికి అపచారం తలపెట్టే మాటలు పొరపాటున కూడా మాట్లాడనని చంద్రబాబు చెప్పారు.
తిరుపతి లడ్డూపై వాస్తవాలు వెల్లడించినందుకు తనకూ బాధగా ఉందని, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ వాస్తవాలు వారికి తెలియాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతల దుర్మార్గాల గుట్టు రట్టు చేయకుండా ఉండలేకపోయానని అన్నారు. 200 ఏళ్ల పైబడిన చరిత్ర కలిగిన ఆలయం తిరుమల అని, తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. తిరుపతి లడ్డు, ఆహార పదార్థాల శుభ్రత, నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. తిరుమలలో లడ్డూ మొదలు ఏ విషయంలో అయినా తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.