ఏమైనా అరుదైన సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో. తమ చేతిలో పవర్ లేనప్పుడు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన వారికి మంచి పోస్టింగులు.. తమను బండ బూతులు తిట్టినోళ్లకు అందలానికి ఎక్కేలా నిర్ణయాలు.. అంతేనా.. కుటుంబం మొత్తాన్ని ఇష్టారాజ్యంగా కామెంట్లు పెట్టిన వ్యక్తి.. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి రావటమే కాదు.. మంత్రి లోకేశ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గత ప్రభుత్వంలో చంద్రబాబును.. లోకేశ్ ను ఇతర తెలుగుదేశం పార్టీ నేతల్ని ఉద్దేశించి దారుణమైన రీతిలో.. చదివితేనే అసహ్యం పుట్టేలా పోస్టులు పెట్టిన ఒకరు తాజాగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి రావటం.. ఏపీ ప్రభుత్వంతో ఒక ఎంవోయూ చేసుకోవటానికి సిద్ధమైన వైనం చూసిన తమ్ముళ్లు షాక్ తిన్నారు.
రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మంత్రి లోకేశ్ సమక్షంలో సిస్కోతో రాష్ట్ర నైపుణ్యాభివ్రద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి సిస్కో ప్రాంతీయ సేల్స్ మేనేజర్.. పబ్లిక్ సెక్టార్ బిజినెస్ అధికారి హోదాలో రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ఇంతకీ ఇతగాడెవరు? అన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ మొదలు తెలుగుదేశం నేతల్ని సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు.. నోటికి వచ్చినట్లుగా బూతులు తిట్టేలా పోస్టులు పెట్టే విషయంలో అతగాడు తోపు.. తురుంఖాన్ గా చెబుతారు.
అలాంటి వ్యక్తి ఇప్పుడు మంత్రి లోకేశ్ తో కలిసి ఎంవోయూ చేసుకోవటం ఏమిటన్న విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి. అంతేకాదు.. రవీంద్రారెడ్డి పెట్టిన అసభ్యకర పోస్టులు.. బూతులతో కూడిన సందేశాల్ని పోస్టు చేయటం ద్వారా.. అతడి స్థాయిని గుర్తుకు తెచ్చేలా తెలుగు తమ్ముళ్లు పోస్టులు పెట్టారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో మంత్రి లోకేశ్ పేషీ స్పందించింది. సిస్కోకు ఘాటు లేఖ రాసి రవీంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో సోషల్ మీడియాలో అతగాడి పోస్టులను ప్రస్తావించారు.
ఏపీ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్లాలంటే మాత్రం రవీంద్రారెడ్డిని పకకన పెట్టాలని.. వెంటనే చర్యలు తీసుకొని… దానికి సంబంధించిన సమాధానం చెప్పాలని కోరారు. ఏమైనా.. చంద్రబాబు నేత్రత్వంలోని కూటమి సర్కారులో ఇప్పటివరకు పలు సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన వారంతా కూటమి సర్కారులోనూ కీలక స్థానాల్లో కనిపించటాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
రవీంద్రారెడ్డి ఎపిసోడ్ లోనూ తెలుగు తమ్ముళ్లు స్పందించి.. అతడి ఘన చరిత్రను గుర్తు చేస్తూ.. ప్రశ్నించటంతో మంత్రి లోకేశ్ టీం ఉలిక్కిపడినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. అవకాశాల్ని అందుకునే విషయంలో రవీంద్రారెడ్డి లాంటి వాళ్లు దూసుకెళ్లటం ఒక ఎత్తు అయితే.. అలాంటోళ్లను తమ దరిదాపుల్లోకి రాకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకునే విషయంలో బాబు అండ్ కో తరచూ ఫెయిల్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.