ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు సతీసమేతంగా సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు…గత ప్రభుత్వ పాలనపై, వైసీపీ నేతల బూతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారని, ప్రతిపక్ష నేతలను అసభ్య పదజాలంతో దూషించేవారని చంద్రబాబు మండిపడ్డారు. తమ 100 రోజుల పాలనలో ఏనాడూ వైసీపీ నేతలను కూటమి నేతలు బూతులు తిట్టలేదని, క్రమశిక్షణ, నిబద్ధత ఉన్న పార్టీల నేతలు ఈ విధంగా నడుచుకుంటారని చంద్రబాబు చెప్పారు.
వైసీపీ రాష్ట్రానికి పట్టిన అరిష్టమని, ఈవీఎంల టాంపరింగ్ గురించి ఈ రోజు జగన్ మాట్లాడుతున్నారని, మరి 2019 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా? ఆనాడు జగన్ ఎలా గెలిచాడు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కూడా చంద్రబాబు స్పందించారు. సెయిల్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనం చేసే అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని, కేంద్రంతో పాటు సెయిల్ కంపెనీ యాజమాన్యం ఇందుకు అంగీకరించాల్సి ఉంటుందని చంద్రబాబు చెప్పారు.