బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్న సంగతి తెలిసిందేే. ఎస్సీల వర్గీకరణ అంశం కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగింది. ఇక, కొద్ది రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చిన సమయంలోనూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎస్సీల అభ్యున్నతి కోసం చంద్రబాబు మరో ముందడుగు వేశారు.
ఎస్సీ ఉపవర్గీకరణపై ఎన్డిఎ సంకీర్ణ పార్టీలకు చెందిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సి) ఎమ్మెల్యేలతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార అవకాశాలకు సమాన ప్రాధాన్యమిస్తూ జిల్లా యూనిట్ ప్రాతిపదికన ఉప-వర్గీకరణను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఎస్సీ సబ్ కమ్యూనిటీలకు సమాన అవకాశాలను నిర్ధారించడంలో ప్రాముఖ్యతను చంద్రబాబు వివరించారు. ఎస్సీ ఉప-వర్గీకరణ వివిధ ఉప కులాలలో దామాషా అవకాశాలకు హామీ ఇస్తుందని, జనాభా పంపిణీ ఆధారంగా న్యాయమైన వనరుల కేటాయింపును అనుమతిస్తుందని చంద్రబాబు అన్నారు.
ఇందుకు సంబంధించిన అధ్యయనానికి త్వరలో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం లేకుండా నెల రోజుల్లో నివేదిక అందేలా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పలు సూచనలు చేయగా, వాటిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
దళితుల అభివృద్ధికి టీడీపీ ఎప్పటి నుంచో అండగా ఉందని, 2024 ఎన్నికల్లో 29 ఎస్సీ శాసనసభ నియోజకవర్గాల సీట్లకు గానూ 27 స్థానాల్లో కూటమి అభ్యర్ధులను ప్రజలు గెలిపించారని చంద్రబాబు అన్నారు. దళితుల అభివృద్ధి, సంక్షేమం అమలుపై ఎప్పటికప్పుడు చర్చించేందుకు తరచు దళిత ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.