హరియాణాలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల ట్రెండ్‌లో మాత్రం ఆది నుంచి కాంగ్రెస్ తొలి మూడు నాలుగు రౌండ్ల వరకు దూకుడు ప్రదర్శించింది. కానీ, ఆ తర్వాత.. అనూ హ్యంగా కాంగ్రెస్ వెనుకబడి పోయి.. బీజేపీ ముందుకు దూసుకువచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా మూడోసారి బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వైసీపీ అధినేత జగన్ హరియాణా ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వచ్చిన ఎన్నికల ఫలితాల మాదిరిగానే హరియాణాలోనూ ఎన్నికల ఫలితాలు వచ్చాయని.. అక్కడి ప్రజలను కూడా ఈ ఫలితాలు తీవ్ర గందరగోళంలోకి నెట్టేశాయని జగన్ పేర్కొన్నారు.(అంటే.. ఏపీలో ప్రజలు గందరగోళంలో ఉన్నారని ఆయన భావిస్తున్నట్టుగా ఉంది). ఏపీ ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండాలని ఆయన పరోక్షంగా హరియాణా ఎన్నికలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా జగన్ పేపర్ బ్యాలెట్ పెట్టాలని డిమాండ్ చేయడం గమనార్హం.
“అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ ప్యాపర్ బ్యాలెట్ వినియోగిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, స్విట్జర్లాండ్, తదితర అభివృద్ది చెందిన దేశాల్లో ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ వినియోగిస్తున్నారు. మనం కూడా ఆ దిశగానే అడుగులు వేయాలి. ప్రజాస్వామ్యంగా ప్రజలకు మేలు చేసే నిర్ణయం కోసం.. ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు అద్దంపట్టే నిర్ణయం కోసం.. చట్టసభలు ముందుకు రావాలి“ అని జగన్ పేర్కొన్నారు. అయితే.. జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నేరుగా రియాక్ట్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తీరును ఎండగట్టారు.
2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు.. ఇలా ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు. “2019లో ప్రజాభిప్రాయం ప్రకారమే ఫలితం వచ్చిందా? అని నిలదీశారు. చెత్తమాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి. ఏదైనా ఒక మాట మాట్లాడితే.. విశ్వసనీయత ఉండాలి. కానీ, వీరు నొరు విప్పితే అన్నీ బూతులే. ఇళ్లపై దాడులు చేస్తే.. ఆఫీసులపై దాడులు చేస్తే.. కేసులు పెట్టకూడదా. వీళ్ల అరాచకాలను, వైఖరినీ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నీ అరాచకాలే కనిపిస్తున్నాయి“ అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.