ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసం చేస్తే ఈ జన్మలోనే కర్మ ఫలం అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాదు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 నుంచి 11 స్థానాలకు పరిమితమైన విషయం తెలిసిందే. 151 మంది ఎమ్మెల్యేలతో అప్రతిహతంగా దూసుకుపోయిన.. వైసీపీ ఇప్పుడు.. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి అల్లాడుతు న్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిని పైకి చెప్పకుండానే సీఎం చంద్రబాబు పరోక్షంగా `కర్మ ఫలం` పేరుతో వ్యాఖ్యలు చేశారు.
తాజాగా తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తప్పులు చేసేవారు.. ప్రజలను మోసం చేసేవారు.. నామరూపాలు లేకుండా పోయారని అన్నారు. మోసాలు చేసిన వారు.. దాని తాలూకు కర్మఫలం ఇప్పుడే అనుభ వించాలని వ్యాఖ్యానించారు. కాగా.. తమ ఏడు మాసాల పాలనలో రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి 134 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, దేవాలయం సర్క్యూట్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్చకులకు వేతాలను పెంచినట్టు తెలిపారు.
కుంభమేళాపై మాట్లాడుతూ.. యూపీలో జరుగుతున్న కుంభమేళాను అక్కడి ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోందని చంద్రబా బు తెలిపారు. 55 కోట్లు మంది కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించారని పేర్కొన్నారు. “దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు..అభివృద్ధికి సూచికలు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉంది. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. టెక్నాలజీ వినియోగంలో మనం మరింత ముందుకెళ్ళాలి. ఇవాళ ప్రతి ఇంట్లో ఒక ఎఐ నిపుణుడు తయారవుతున్నాడు. ఆధ్యాత్మిక వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉండాలి“ అని సూచించారు.
కుటుంబ వ్యవస్థ మనదేశానికి అతిపెద్ద ఆస్తిగా పేర్కన్న చంద్రబాబు.. మన సంస్కృతి , వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రదాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం జరుగుతోందని, రాజధాని లో కూడా.. శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. ఆలయాల్లో సైతం గ్రీన్ ఎనర్జీ వినియోగంలోకి తీసుకుని వస్తామన్నారు.