తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాసిన సంగతి తెలిసిందే . ఇరు రాష్ట్రాల మధ్య విభజన అంశాలకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించుకుందామని రేవంత్ రెడ్డి ని చంద్రబాబు కోరారు. ఈ క్రమంలోనే ఈనెల 6న హైదరాబాద్లో సమావేశం అవుదామని ఆ లేఖలో చంద్రబాబు ప్రతిపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లయిందని, అయినా ఎన్నో సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని ముఖాముఖి సమావేశం అయితేనే ఈ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఉన్న కొన్ని అంశాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డితో ఇంతవరకు భేటీ కాలేదు. ఈ క్రమంలోనే ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో గురుశిష్యులుగా ఉన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇపుడు ముఖ్యమంత్రుల హోదాలో భేటీ కాబోతుండడం విశేషం.